నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు చేపట్టిన సమ్మె కొనసాగుతూనే ఉంది. శనివారం నాగర్ కర్నూల్‌లో డప్పుచప్పుళ్ల నడుమ బోనాలు తీసి, బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. గాంధీ పార్కులో నుంచి బస్టాండ్, ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్‌ఏలు పోతురాజుల వేషధారణతో ఆకట్టుకున్నారు. అనంతరం వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ ఎస్‌కే దాదామియా మాట్లాడుతూ తాము కొత్త కోరికలు కోరడం లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలనే నెరవేర్చాలనే అడుగుతున్నామన్నారు. పేస్కేలు, ప్రమోషన్లతో పాటు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, కో చైర్మన్ శంకర్, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, రామయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కాశన్న పాల్గొన్నారు.
24 గంటల కరెంట్ ఏమైంది?
అచ్చంపేట,వెలుగు: సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్ 9 గంటలు కూడా ఇవ్వడం లేదని డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. శనివారం అచ్చంపేట పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లో ఓల్డేజీ, కోతల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్, మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. నాట్లు వేసే సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండడం బాధాకరమన్నారు. 24 గంటలు కాకపోయినా కనీసం 16 గంటలైనా కరెంట్ ఇవ్వాలని, లేదంటే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నర్సయ్య యాదవ్, గౌరీశంకర్, వెంకట్ రెడ్డి, రామనాథం, రఘురాం, ఖాదర్, మల్లిఖార్జున్, రమేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జైపాల్రాజీనామా చేయాలి
అమనగల్లు, వెలుగు: కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జైపాల్యాదవ్రాజీనామా చేయాలని నేషనల్ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి డిమాండ్‌చేశారు. శనివారం ఆమనగల్లులో విలేకరులతో మాట్లాడుతూ జైపాల్‌యాదవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సీఎం కేసిఆర్ఆగమేఘాల మీద పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నారన్నారు. మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే పెండింగ్‌లో ఉన్న రోడ్ల కోసం రూ. 322 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతి గ్రామపంచాయతీకి రూ. 20 లక్షలు ఇచ్చారని చెప్పారు. జైపాల్ యాదవ్ లోకల్ బాడీ ఎన్నిలప్పుడు తలకొండపల్లి మండలంలోని వెల్జాల్‌ను మండలం చేస్తామని చెప్పి తన కూతురును ఏకగ్రీవ సర్పంచ్‌గా గెలిపించుకున్నారని, రఘుపతి పేట, ఇర్విన్, ముద్విన్, గట్టిప్పలపల్లి గ్రామాలను మండలాలుగా మారుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేసి ఈ హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్‌కు ఎన్‌పీ వెంకటేశ్ రాజీనామా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: టీపీసీసీ సెక్రటరీ ఎన్‌పీ వెంకటేశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడలేకపోతున్నానని చెప్పారు. జిల్లాలో అక్రమాలు,ల్యాండ్ మాఫియా, దౌర్జన్యాలు జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాను పని చేసిన ఆరేళ్ల కాలంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం
వనపర్తి, వెలుగు: జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్ అభినందించారు. శనివారం జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో మండల న్యాయసేవాధికార సంస్థ, సాహితీకళావేదిక ఆధ్వర్యంలో జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజసేవలో రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా, బాధ్యతగా భాగస్వాములు అవుతున్నారని కొనియాడారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు వారిని స్పూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
వయో వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్తి తగాదాలు, పోషణ తదితర సమస్యలు ఉంటే రెవెన్యూ ఆఫీసర్లు, న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ వెంకట్రామారెడ్డి, సుగుణబ్రహ్మయ్య, గోపాలస్వామి, పాపయ్యశెట్టి, సవారమ్మ, సుజాతమ్మ తదితరులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహితీకళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, శ్రీనివాసులు శెట్టి, నరసింహ గౌడ్, భైరోజు చంద్రశేఖర్, ఉత్తరయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.
టూరిజం స్పాట్‌గా తిరుమలయ్య గుట్ట
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రానికి ఆనుకుని సుమారు ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తిరుమలయ్య గుట్ట అటవీ ప్రాంతం వనపర్తికి వరమని, దీన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శ్రావణ శనివారం ఉత్సవాల్లో భాగంగా తిరుమలేశుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుదైన వనమూలికలకు ఈ అటవీప్రాంతం ప్రసిద్ధి గాంచిందన్నారు. తిరుమలయ్య గుట్ట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టడంతో పాటు అడవిని మరింత విస్తరిస్తామన్నారు. గుట్టపైకి వెళ్లేందుకు రహదారి వెంట మెట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఆలయం వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో 140 మంది లబ్ధిదారులకు రూ.44.52 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్ది, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.