భూ వివాదాలకు చెక్​ పెట్టేలా.. సర్వే జరగాలి

భూ వివాదాలకు చెక్​ పెట్టేలా.. సర్వే జరగాలి
  • ధరణి తెచ్చిన తిప్పలను పరిష్కరించాలి
  • గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గత సర్కార్​ నాశనం చేసింది
  • నూతన ఆర్ఓఆర్  ముసాయిదా బిల్లుపై చర్చలో వక్తలు
  • దొరకు నచ్చలేదనే వీఆర్​వో వ్యవస్థను తీసేసిండు: మంత్రి పొంగులేటి
  • గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని వెల్లడి
  • ధరణి తెచ్చిన తిప్పలను పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: భూ సమస్యలన్నిటికీ జిల్లా స్థాయిలోనే పరిష్కారం చూపాలని వక్తలు అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో మళ్లీ రెవెన్యూ వ్యవస్థ తీసుకు రావాలని కోరారు. కౌలుదారులకు న్యాయం చేయడంతోపాటు, భూ వివాదాలకు చెక్​ పెట్టేలా సమగ్ర సర్వే జరగాలని అభిప్రాయపడ్డారు. ధరణితో రైతులు చాలా తిప్పలు పడ్డారని వారు తెలిపారు. ధరణి వల్లనే భూముల హక్కులను కోల్పోయే పరిస్థితి వచ్చిందని, కొందరు ఆ సమస్యలను పరిష్కరించుకోలేక సగం ధరకే భూములు అమ్ముకున్నారని వక్తలు పేర్కొన్నారు. 

ఎవరికి చెప్పకుండా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ధరణిని తీసుకువచ్చి, జనాన్ని ఇక్కట్ల పాలుచేసిందని మండిపడ్డారు. నూతన ఆర్ఓఆర్  ముసాయిదా బిల్లుపై సోమవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని టూరిజం ప్లాజా హోటల్ లో రాష్ట్ర స్థాయి చర్చా వేదిక జరిగింది. ఇందులో పలువురు వక్తలు మాట్లాడుతూ.. భూముల అంశాలకు సంబంధించి రికార్డింగ్ అథార్టీగా తహశీల్దార్​, అప్పిలేట్ అథారిటీగా ఆర్డీవో, రివిజన్ అథారిటీగా జాయింట్​ కలెక్టర్​ను నియమించాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం నాశనం చేసిందని, ప్రజలతోపాటు రెవెన్యూ డిపార్ట్​మెంట్​ కూడా ఆ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుందని తెలిపారు. 

లోక్​ అదాలత్​పై డిస్క్రిప్షన్​ ఇవ్వాలి: ఆర్డీవో చంద్రకళ

లోక్ అదాలత్ అంటే ఎలాంటి వాటికి మ్యూటేషన్ చేస్తారనేది డిస్క్రిప్షన్ ఇవ్వాలని ఆర్డీవో చంద్రకళ సూచించారు. లేదంటే ఇద్దరు వచ్చి లోక్ అదాలత్ పేరుతో రెవెన్యూ సిబ్బందిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అన్నారు. సబ్ డివిజన్లు విలేజ్ మ్యాప్ లో రిఫ్లెక్ట్ అయ్యేలా చూడాలని చెప్పారు. పహానిలు జూన్ ఫస్ట్ నుంచి రాసేలా  చూడాలన్నారు.  

గత సర్కార్​ రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది

ప్రజల్లోనే కాదని.. గత ప్రభుత్వం మళ్లీ రావొద్దనేది రెవెన్యూ డిపార్ట్​మెంట్ కూడా కోరుకుందని ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతమ్ తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను అంతలా గత ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం కోరడం సంతోషకరమని తెలిపారు.  
    
నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచిన అంశాలను వాటి ప్రత్యేకతలను రైతులకు, పట్టేదార్లకు చేకూరే ప్రయోజనాలను చర్చా వేదికలో భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ వివరించారు. గత చట్టం వల్ల రైతులకు జరిగిన నష్టాలను కొత్త చట్టం వల్ల కాలయాపన లేకుండా అందే సేవలను తెలియజేశారు. 

డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు కె.చంద్రమోహన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇచ్చేది కాదని, కొత్త ప్రభుత్వం రాగానే ఉద్యోగుల సమస్యలపై సంఘం నాయకులతో మాట్లాడి పరిష్కారం దిశగా ఆలోచించడం శుభపరిణామమని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో పాటు వారి సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. 
    
ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ కవి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి, క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు వెంకట ఉపేందర్ రెడ్డి, హమీద్, రిటైర్డ్ తహసీల్దార్లు బాలరాజు, ఆంజనేయులు, హైకోర్టు అడ్వకేట్లు టి.శ్రీనివాస్ గౌడ్, విశ్వశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ డిప్యూటీ కలెక్టర్లు చంద్రావతి, రమాదేవి, అనురాధ సూర్యలత, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

ధరణి తెచ్చిన కష్టాలకు చరమగీతం: పొంగులేటి

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి ఒక ఉన్నతాధికారి కలిసి  కుట్రపూరితంగా రాత్రికి రాత్రి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి భూ చిక్కులు లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం -2024ను తీసుకువస్తున్నామని తెలిపారు. “చట్టాలు సరిగ్గా చేయకపోతే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 

గతంలో మాదిరిగా జరగకుండా ఉండడానికి ఒక రోజు ఆలస్యం అయినా కూడా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నాం” అని వివరించారు. ‘‘దొరగారికి నచ్చలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఏఓ వ్యవస్థను ఉన్నఫళంగా రద్దు చేసి మొత్తంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ భూ పరిపాలన చూసే యంత్రాంగం లేకుండా చేసింది. రైతులకు, ప్రజలకు రెవెన్యూ అందుబాటులో లేకుండా పోయింది” అని అన్నారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని, అలాగే రెవెన్యూ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.