గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు పంచమంలో తదుపరి ఉగాది వరకు షష్టమ స్థానమందు సంచారం. శని 22.03.2023 నుంచి 08.04.2024 ఉగాది వరకు అర్ధాష్టమిలో సంచారం. రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు షష్టి నవ్య స్థానంలో, తదుపరి ఉగాది వరకు పంచమంలో సంచారం. కేతువు 30.10.2023 నుంచి 08.04.2024 ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం.
ఈ రాశి స్త్రీ పురుషులకు కృషి, పట్టుదల ఉంటే ప్రతి విషయంలో పట్టు సాధించగలరు. రైతు సోదరులకు సామాన్యం. తిథి నక్షత్రాల బలంతో వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు శ్రమ అధికం. నిరుద్యోగులకు ఉద్యోగం ఆలస్యమవుతుంది. డాక్టర్లు, లాయర్లకు అనుకూలం. కాంట్రాక్టర్లు టెండర్లు జాగ్రత్తగా వేయాలి. రాజకీయ నాయకులు గౌరవ మర్యాదలు పొందుతారు. వెండి, బంగారం, కాపర్, స్టీలు, సిమెంట్, టింబర్ ధరలు పెరుగుతాయి. విదేశీయానం కలిసి వస్తుంది. పరిశ్రమల వారికి, విద్యార్థులకు అనుకూలం. విదేశీ చదువులకు ఉన్న ఆటంకం తొలగును. పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమలు సామాన్యం. చిట్స్, ఫైనాన్స్, షేర్ల వ్యాపారాలు ఒడిదుడుకులతో ఉంటాయి. శని ప్రభావం వలన ఆర్థిక లోటుపాట్లు. నవగ్రహ, శివాలయ ప్రదక్షిణలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయడం వలన భయం, భీతి అనేది తెలియదు. తోటి వారు సహాయ సహకారాలు అందిస్తారు. గురువు వక్ర సంచారం వల్ల అనేక సమస్యలు. గురు జపం, దైవారాధన వలన వచ్చిన సమస్యలు వచ్చినంత తొందరగా పోతాయి. ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సి రావొచ్చు. ఎంత నిర్మొహమాటంగా ఉంటే అంత ఆనందంగా ఉంటారు. గృహ నిర్మాణాలు వాయిదా వేయటం మంచిది. శని వక్రమంలో ఉన్నందున ఏ కొత్త పనిలో అడుగు పెట్టరాదు. జూన్ నెల నుంచి నవంబర్ మధ్యలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు అనేక రకాలుగా చిక్కుల్లో పడేస్తాయి. ఈ సమయంలో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా తమలపాకులతో పూజించాలి. ధ్వజ స్థంభం దగ్గర ఇప్పపువ్వు నూనెతో అఖండ దీపారాధన చేసి, 42 సార్లు ప్రదక్షిణలు చేస్తే, సమస్యలు అదుపులో ఉంటాయి. ఎవరికి వారు జాగ్రత్తగా, భక్తి మార్గంలో అడుగుపెట్టండి. మీకు తెలియకుండా వచ్చిన సమస్యలు తెలియకుండానే పోతాయి. విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి. దక్షిణామూర్తికి, సాయినాథునికి పూజలు చేయాలి. అనూరాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. శనికి తైలాభిషేకం, మహన్యాస రుద్రాభిషేకం చేయడం వలన కొంతవరకు మనఃశ్శాంతి ఉంటుంది. నలుపు నువ్వులు కడిగి ఎండపోసినవి కొన్ని, నలుపు వస్త్రం, నువ్వుల నూనెతో అభిషేకం చేయించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు జాతి పచ్చ కుడి చేతి చిటికెన వేలుకు ధరించాలి. శ్రీవెంకటేశ్వరస్వామివారి అలంకరణ చేయించి, చక్కెర పొంగలి ప్రసాదాలు మహా నైవేద్యంగా పెట్టండి. మంగళవారం రాత్రి మీరు పడుకునే కుడిపక్కన 500 గ్రాములు పచ్చ పెసలు నానబెట్టి, బుధవారం ఉదయం పావురాలకు మేతగా వేయండి. తల్లిదండ్రులను గౌరవించండి. పెద్దలకు అమావాస్య రోజున తర్పణలు చేయించండి. కొంత డబ్బు అన్నదానం చేసే వారికి సమర్పించండి. అదృష్ట సంఖ్య 9.
వృశ్చిక రాశి మాస ఫలితాలు
చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. ప్రతి విషయంలో సామరస్యంగా అవాంతరాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి. మీకు శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుజుడు ఇబ్బందులు పెట్టగలడు. రాహుకేతువులు గురువు. మహాన్యాస రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.
వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. ఆర్థికంగా పుంజుకోగలరు. ఆకస్మిక ధన లాభ సూచనలు. మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఏ విధమైన సమస్యలు వచ్చినా నిబ్బరంగా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించి, ప్రదక్షిణాలు చేయాలి.
జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయ వనరులు అనుకూలమనే చెప్పాలి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నాచితక ఒత్తిడి ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. నిబ్బరంగా ఉండాలి. ఏ సమస్య అయినా తొలగిపోతుంది.
ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. కుటుంబంలో అందరూ కలిసి ఏ పనినైనా ప్రారంభించండి. చాలా సందర్భాల్లో కూల్‌గా, నిబ్బరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గురు పూజలు, సాయిబాబా దర్శనం, శనగ గుగ్గిళ్లు ప్రసాదంగా గురువారం ఉదయం సాయిబాబా దేవాలయంలో పంచండి.
అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. లక్ష్మీ, విఘ్నేశ్వర హోమం చేయించండి. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. శనివారం శనికి తైలాభిషేకం చేయండి. వృత్తి వ్యాపారాల్లో ధనాదాయ వనరులు ఉన్నవి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సమయం కాదు. స్నేహితులతో చక్కగా ఉంటారు. కానీ, జాగ్రత్తలు తీసుకోవాలి. శనికి తైలాభిషేకం చేయండి.
నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. తొందర వద్దు. సంతృప్తికరమైన ఆదాయ వనరులు కలిగి ఉన్నారు. ఆకస్మిక ధన సంపాదన. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. పెండింగ్ పనులు నెరవేరుతాయి. దైవ దర్శనం అఖండ దీపారాధన, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయండి.
భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. వస్తు వాహన భయాలు, ఆభరణాల ప్రాప్తి, తెలియని విధంగా ధనాదాయం కలిగి ఉన్నారు. ఆధ్యాత్మిక విషయంలో శ్రద్ధ చూపగలరు. మానససికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోగలరు.
ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. నేర్పుగా, ఓర్పుగా చాకచక్యంగా వ్యవహరించాలి. రాహు కేతువులకు పూజలు, గ్రామ దేవతలకు పూజలు చేస్తే, ప్రతి విషయంలో సత్ఫలితాలు కనిపించగలవు. దుర్గా దేవి పూజలు చేస్తే శాంతి సౌఖ్యంతో ఉంటారు.
కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. గ్రహ కలయిక దోషం వల్ల ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. వ్యాపారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఇచ్చిపుచ్చుకోవటంలో లోటుపాట్లు గమనించి సరిదిద్దుకోవాలి. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు, శనికి నలుపు గొంగళి దానంగా ఇవ్వాలి.
మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉండదు. ఇంటా బయటా ఏ రూపంలోనూ మనఃశ్శాంతి ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు. ఎన్ని సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, మృత్యుంజయ జపం, నవగ్రహ ప్రదక్షిణాలు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు 45 ప్రదక్షిణాలు చేయండి.
పుష్య మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. ఆదాయ వ్యయములు బ్యాలెన్స్‌గా ఉంటాయి. అవసరానికి ఏదో విధంగా సర్దుబాటు జరుగును. ఎవరికీ హామీ ఉండొద్దు. మానసిక బాధలు, అనారోగ్య సమస్యలు. తొందరపాటు ఆలోచనలు చేయొద్దు. ఇష్టదైవారాధన చేయండి. అఖండ దీపం పెట్టండి.
మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. బంధు మిత్రుల కలయిక, విందువినోదాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ప్రయత్న లాభం ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, ధ్యానం చేయాలి. జాగ్రత్తగా ఆలోచించి నిరంతరం దైవ ప్రార్థన చేయండి.
ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం తగదు. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. తక్కువగా, మెల్లిగా మాట్లాడండి. లేక నోటిలో నీరు పెట్టుకోండి. గ్రహ సంచారంలో ఉన్న ఇబ్బందుల వలన మన పరిస్థితులు కూడా అమావాస్య, పౌర్ణమిలాగా వచ్చి పోతుంటాయి. గ్రహ ఆరాధనతో గృహంలో శాంతి ఉంటుంది.