Ugadi Rasi Phalalu 2023 - Vrushabha Rashi : వృషభ రాశి ఫలితాలు

Ugadi Rasi Phalalu 2023 - Vrushabha Rashi : వృషభ రాశి ఫలితాలు

గురువు 22.03.2023 నుంచి 8.04.2024 వరకు వ్యయంలో లోహమూర్తిగా సంచారం. శని 22.02.2023 నుంచి 08.04.2024 వరకు దశమంలో తామ్ర మూర్తిగా సంచారం. రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు ఏకాదశి స్థానంలో సువర్ణమూర్తిగాను, తదుపరి ఉగాది వరకు వ్యయంలో రజితమూర్తిగా సంచారం. కేతువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు వ్యయంలో రజితమూర్తిగాను, 30.10.2023 నుంచి 08.04.2024 వరకు సువర్ణమూర్తిగా సంచారం. 

ఈ రాశి స్త్రీ, పురుషులకు చాలా అనుకూలం. రైతు సోదరులకు ముహుర్త బలంతో సంతృప్తికరంగా పంటలు పండుతాయి. వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు సంతృప్తికరమైన ఆదాయం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు ఇది కలిసి వచ్చే కాలం. రాజకీయ నాయకులు సామరస్య ధోరణిలో ఉంటే రాణించగలరు. విందువినోదాలు,  వివాహ ప్రయత్నాలు ఫలించి సంతృప్తికంగా ఉంటాయి. కానీ, తొందరపాటు నిర్ణయాలు వల్ల ఆకస్మిక కలహాలు వస్తాయి. వెండి, బంగారం,వాహనయోగం, నూతన గృహ యోగం, గృహ అలంకార వస్తువులు  సమకూర్చుకుంటారు. ఏదో ఒక విధంగా అభివృద్ధి పథంలో ఉంటారు. విద్యార్థులకు విదేశీయానం. ఇష్టంగా చదివిన వారికి అధిక మార్కులు వస్తాయి. ఉద్యోగ ప్రాప్తి ఉంది. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు అనుకూలం. ఐరన్‌, సిమెంట్‌, టింబర్‌‌ వారికి సామాన్యం. స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీలు లాభాల బాట పడతాయి. బిగ్‌ ఇండస్ట్రీల వారికి అధిక భయాలు ఉంటాయి. కెమికల్స్‌, హోటల్స్‌ వారికి ఈ ఏడాది అనుకూలం. పాడి పరిశ్రమలో ఉన్నవారు లాభాల బాటపడతారు. పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ వారికి అనుకూలం. ఏ రంగాల్లో ఉన్నా అధిక ఫలితాలు ఉండగలవు. కానీ, వాస్తులేని వారికి సామాన్యంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దుర్మార్గులతో పొత్తు, స్నేహం వలన చాలా సమస్యలు వస్తాయి. ప్రతి విషయంలో మెలకువలు పాటించాలి. సమన్వయంతో పనిలేకుండా జాగ్రత్తలు పాటించాలి. స్త్రీల విషయంలో నిర్మొహమాటంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి. భర్తకు కోపం వస్తే భార్య సానుకూలంగా, భార్యకు కోపం వస్తే భర్త ప్రేమగా పరిష్కరించుకోవాలి. ప్రతి విషయంలో చాకచక్యంగా, తెలివిగా ఉన్నవారు అధికంగా లాభపడతారు. తక్కువ మాట్లాడి, ఎక్కువ వనరులు సమకూర్చుకోగలరు. అందరితో అనుకూలంగా ఉన్నవారికి పరిమితి లేని వనరులు, తగినంత ధనార్జన ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణలు, దానములు, మహాన్యాస రుద్రాభిషేకం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎంతపెద్ద సమస్య అయినా ఇట్టే పరిష్కరించుకోగలరు. కోర్టు కేసులు రాజీ మార్గంలో విజయం సాధిస్తారు. పంతాలు, పట్టింపుల వల్ల అనేక సమస్యలు వస్తాయి. పెద్దలను గౌరవించాలి. వృద్ధులను అనాథాశ్రమాల్లో ఉంచకండి. చాలా సంతృప్తికర ఆదాయం. 

సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధన లాభం. నిత్య దీపారాధన వల్ల గృహంలో శాంతి. కృత్తిక నక్షత్రం వారు జాతి కెంపు ధరించాలి. ఆదిత్య హృదయ పారాయణం, సూర్య నమస్కారాలు 12 సార్లు చేసిన పరిపూర్ణమైన ఆరోగ్యం, ప్రశాంతత కలుగుతాయి. రోహిణి నక్షత్రం వారు ముత్యం ధరించాలి. దుర్గాదేవి ఆరాధన చేయాలి. మృగశిర నక్షత్రం వారు పగడం ధరించాలి. స్కందగిరిలో సుబ్రమణ్యేశ్వర స్వామివారి పూజలు, పాలాభిషేకాలు, హోమం చేయడం వల్ల మనఃశ్శాంతి ఉంటుంది. తొమ్మిది మంగళవారాలు ఎరుపు గోవుకు 450 గ్రామల కందులు నానబెట్టి దానాగా పెట్టాలి. ధ్యానం, యోగా చేయాలి. చాలా యాక్టివ్‌గా ప్రతి విషయంలో అడ్వాన్స్​గా ఉంటారు. శునకం (కుక్క)ను చూసి బయటకు వెళ్లగలిగితే చాలా మంచిది. ‘‘ఓం.. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.. ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్‌‌ ముక్షీయ మామృతాత్‌!!”ఈ మహా మృత్యుంజయ మంత్రం చదివిన వారి ప్రయాణంలో ప్రమాదాలు రావు. అదృష్ట సంఖ్య 6. 

వృషభ రాశి మాస ఫలితాలు

చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల అనుకూలం. బంధు మిత్రుల కలయిక, పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. శుభకార్యాలపై శ్రద్ధ వహిస్తే అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన సంపాదనకు ప్రయత్న లోపం ఉండరాదు. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు చేసుకొనుట వలన శుభప్రదంగా ఉంటుంది.

వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. గురు బలం కోసం దక్షిణామూర్తికి, షిరిడీ సాయిబాబాకు పూజలు చేయాలి. వృత్తి వ్యాపారాల్లో కొంత శుభపరిణామాలు ఉంటాయి. గత నెలలోలాగా ఈ నెల కూడా చాలా బాగుంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఈ నెలంతా సంతృప్తికరం.

జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల చాలా అనుకూలం. చాలా సందర్భాల్లో తక్కువగా మాట్లాడి ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న పనులు చేసుకోగలరు. శుభపరిణామాల కోసం శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి వారికి హోమం, అభిషేకం చేయాలి. ఊహించనంత మార్పు ఉంటుంది.

ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ, పురుషులకు తెలియకుండానే ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం. ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తే పెండింగ్‌ పనులు సానుకూలంగా జరిగిపోతుంటాయి. ఇది కాల మహిమ. అఖండ దీపారాధన, దేవి పూజలు చేయాలి.

అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. శకునం చూసి బయటకు వెళ్లాలి. ప్రతి విషయంలో రాజీ పడరాదు. తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ జపాలు లేదా నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో శ్రమ అధికం. ఏ పని అనుకున్నా వాయిదా పడుతుంది. గ్రహ కలయికలు కొంత ఇబ్బందిగా ఉన్నాయి. గురు పూజలు, ఇష్టదేవతా పూజల వలన చివరి దశలో పనులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంఘంలో గౌరవ, మర్యాదలు పొందుతారు.

భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో అనుకూలం. మాటలతో కాలయాపన చేయకూడదు. నిర్లక్ష్యంగా ఉండరాదు. ప్రతి నిమిషం మీకు అనుకూలం. విఘ్నేశ్వరుడిని మనఃస్ఫూర్తిగా ఆరాధిస్తే మీకు ఏమి అవసరమో అవి ఇస్తాడు.

కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు ఇష్టంగా ఏ పని  చేసినా త్వరగా పూర్తవుతుంది. విశ్వాసంతో ముందుకు సాగాలి. పట్టుదలతో ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చగలదు. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. శ్రీసత్యదేవుని వ్రతం, మహాన్యాస రుద్రాభిషేకం చేయించండి.

మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు చేస్తున్న పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు. అనారోగ్య సూచనలు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒకదానికి, రెండో దానికి వ్యత్యాసాలు ఉన్నాయి. మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. దైవాన్ని పూజించడం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. దేవతారాధనలు తప్పనిసరి.

పుష్యమాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అధికార లాభం. మీ పనులు పూర్తి చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగండి. నిర్లక్ష్యం పనికిరాదు. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. కుటుంబంలో కలహాలకు అవకాశం ఇవ్వరాదు. సుబ్రమణ్యేశ్వర స్వామిని పూజించాలి.

మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు విందు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూములు, ఆభరణాలు, అలంకార సామగ్రి, ఇంట్లో అవసరమైన సామాన్లు కొంటారు. గ్రామ దేవతలను స్మరించుకోవాలి.

ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ఆదాయం సమకూరే టైమ్‌. పట్టుదలతో ముందుకు సాగాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. అదృష్టంలో కూడా కొన్ని దోషాలు కలిగి ఉన్నాయి.