కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్టను ‘జటాయు సంరక్షణ’ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పెంచికల్‌పేట రేంజ్ పరిధిలోని ప్రాణహిత, పెద్దవాగు సంగమ తీరాన 300 మీటర్ల ఎత్తులో ఉన్న పాలరాపు గుట్ట ఒకప్పుడు రాబందులు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ గుట్టపై 30 వరకు రాబందులు ఉండేవి. వీటి ఉనికిని గుర్తించిన అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు. రెండ్రోజులకు ఒకసారి పాలరాపుగుట్ట వద్ద ఓ పశు కళేబరాన్ని రాబందులకు ఆహారంగా అందించారు. ఈ క్రమంలో వాటి సంతతి కూడా పెరిగింది. అయితే, మధ్యలో ఇవి కనుమరుగైపోయాయి. పొరుగున ఉన్న మహారాష్ట్రకు వలస పోయాయని భావించారు. కానీ ఇటీవల మళ్లీ పాలరాపు గుట్టపై రాబందులు సంచరించడంతో సంరక్షణకు చర్యలు చేపట్టారు. ప్రాణిహితకు ఆవలివైపు ఉన్న కమలాపూర్ అడవి నుంచి రాబందులు రాపోకలు సాగిస్తున్నాయని, అక్కడ అడవిలో మరో ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. తిరిగి పాలరాపుగుట్టకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు టూరిజం డెవలప్ మెంట్లో భాగంగా రూ.2.5 కోట్లతో రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మనుషుల రాకపోకలు పెరిగిపోవడం, అడవిలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటం, సరైన ఆహారం లభించకపోవడంతో రాబందులకు సురక్షిత ప్రాంతం కాదని భావించి వలసపోతున్నాయని వన్యప్రాణి సంరక్షకులు
పేర్కొంటున్నారు
అంతరించిపోవడానికి డైక్లోఫినాక్ కారణం
పశువులు చనిపోయినప్పుడు బ్యాక్టీరియా, వైరస్ వ్యాపిస్తుంది. మరణించిన జంతువుల కళేబరాలను తింటూ రాబందులు వ్యాధుల వ్యాప్తిని అడ్డుకుంటూ పరోక్షంగా మనుషులకు మేలు చేస్తున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుతున్నాయి. కాలక్రమంలో ఈ పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మన రాష్ట్రంలో వీటి ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. రాబందుల సంఖ్య తగ్గిపోవడానికి పశువులకు వాడే డైక్లోఫినాక్ ఔషధమే కారణమని భావించిన కేంద్రం.. దీనిపై నిషేధం విధించింది. పశువులకు జ్వరం వచ్చినప్పుడు, ఇతర వ్యాధులు సంక్రమించినప్పుడు డైక్లోఫినాక్ ఇంజక్షన్‌ను వినియోగించేవారు. ఈ క్రమంలో మరణించిన పశువుల కళేబరాలు, మాంసం తిని రాబందులు మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి ఈ ఔషధంపై కేంద్రం పూర్తిగా నిషేధం విధించింది. మెడికల్ షాపుల్లోనూ ఈ ఔషధం విక్రయించకుండా చర్యలు చేపట్టింది. డైక్లోఫినాక్ ప్రత్యామ్నాయంగా పశువులకు ఉపయోగిస్తున్న పలు ఔషధాలు సైతం రాబందుల ఉనికికి ప్రమాదకరమని గుర్తించి, వాటిని కేంద్రం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ ఔషధం వాడకుండా వెటర్నరీ డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. రాబందుల సంరక్షణ మానవాళి బాధ్యత, వాటిని కాపాడుకుంటేనే వైరస్లు సోకవని వన్యప్రాణి సంరక్షణ అధికారులు పేర్కొంటున్నారు.
మహారాష్ట్ర నుంచి తెచ్చేందుకు కసరత్తు
రాష్ట్రంలో రాబందుల సంతతిని పెంచడం కోసం ఇతర ప్రాంతాల నుంచి రాబందుల జంటలను నెహ్రూ జూపార్క్ తీసుకొచ్చి సంతానోత్పత్తి పెంచనున్నారు.వన్యప్రాణి సంరక్షణ విభాగం రాబందుల సంరక్షణకు చర్యలు చేపడుతుండగా.. దీనికి సెంట్రల్ జూ అథారిటీ నిధులు సమకూరుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర నుంచి రాబందులను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రాబందు జీవిత కాలం 40- నుంచి 45 ఏండ్లు మాత్రమే కావడంతో 15 నుంచి 20 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వాటిని తీసుకురావాలని భావిస్తున్నారు.