- కుమ్రంభీం జిల్లాలోని పాలరాపుగుట్టపై సంరక్షణ కేంద్రం
ఆసిఫాబాద్, వెలుగు :కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్టను ‘జటాయు సంరక్షణ కేంద్రం’గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని నందిగాం అడవుల్లో ప్రాణహిత, పెద్దవాగు కలిసే చోట ఉన్న పాలరాపుగుట్టపై పదేండ్ల కింద రాబందుల జాడను మొదటిసారి గుర్తించారు. అప్పట్లో 30 వరకు రాబందులు ఉండగా, ఇటీవల వాటి సంఖ్య తగ్గింది.
కొంతకాలంగా ప్రాణహితకు ఆవలివైపు మహారాష్ట్రలోని కమలాపూర్ అడవిలో రాబందులు మరో ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. అక్కడి నుంచే పాలరాపుగుట్ట వైపు వచ్చిపోతున్నాయని చెప్తున్నారు. తిరిగి రాబందులను పాలరాపు గుట్ట వైపు ఆకర్షించి, వాటి సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ‘ఏకో టూరిజం డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’లో భాగంగా సుమారు రూ.2.5 కోట్లతో రాబందుల ఆవాసాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
మనుషుల అలికిడి తగ్గితేనే..
ప్రాణహిత,- పెద్దవాగు నదులు కలిసే దట్టమైన అటవీ ప్రాంతంలో, భూమి నుంచి 300 మీటర్ల ఎత్తుతో పాలరాపుగుట్ట ఏటవాలుగా ఉంది. ఈ గుట్టపై రాళ్లకు చిన్న, చిన్న రంధ్రాలు ఉండడంతో అందులో రాబందులు ఆవాసాలు ఏర్పరుచుకున్నాయి. పదేండ్ల క్రితం వరకు ఇక్కడ 30 దాకా ఉన్న రాబందులు ప్రతికూల పరిస్థితుల కారణంగా 15 కిలోమీటర్ల దూరంలోని కమలాపూర్ అడవుల వైపు వలసపోయాయి.
ప్రస్తుతం అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడిక్కడ కేవలం మూడు రాబందులు మాత్రమే ఉంటున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సర్వసభ్య సమావేశంలో ఈ విషయం చర్చకు రాగా, రాబందులను తిరిగి పాలరాపు గుట్టలకు రప్పించి, సంరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే జిల్లా అటవీ అధికారుల ప్రతిపాదనల మేరకు ‘జటాయు సంరక్షణ కేంద్రం’ ఏర్పాటుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్లు కేటాయించింది. నిజానికి పాలరాపు గుట్టల వెంట పెరిగిన మనుషుల అలికిడే రాబందులు వలస పోవడానికి ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు.
దీనికి తోడు ఆహారం దొరకకపోవడం, అడవిలో నిప్పు రాజేయడం, నీరు కలుషితం కావడం మరిన్ని కారణాలుగా గుర్తించారు. దీంతో ‘జటాయు సంరక్షణ’ చర్యల్లో భాగంగా అటవీ సమీప గ్రామాల్లో రైతులు, పశువుల కాపారులకు ఫారెస్ట్ ఆఫీసర్లు అవగాహన కల్పించనున్నారు. పాలరాపు గుట్టల వెంట అటవీ ఉత్పత్తులు, వంట చెరుకు సేకరణ నిషేధించనున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. ప్రత్యామ్నాయంగా పశువుల మేత కోసం గ్రామశివార్లలోనే గడ్డి క్షేత్రాలను పెంచుతారు. అడవిలో నిప్పు రాజుకోకుండా చర్యలు తీసుకోనున్నారు.
సహజ రీతిలో రాబందులకు ఆహారం అందేలా చూడడం మరొకటి. పశువుల్లో నొప్పినివారణ, గాయాలు మానేందుకు ఇచ్చే డైక్లోఫెనాక్ ఇంజక్షన్ కారణంగానే రాబందుల జాతి అంతరించిపోతోందని శాస్త్రవేత్తలు గతంలోనే తేల్చారు. అటవీ ప్రాంతాల్లోని పశువులకు ఆ ఇంజక్షన్లు వాడకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు.
రాబందుల రక్షణ... ఏకో టూరిజం పై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో ఎక్కడా లేని రాబందులు ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలంలోని పాలరాపుగుట్టలో ఉండటం విశేషం. వీటిని పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ప్రభుత్వం, అటవీశాఖ తీసుకున్న నిర్ణయం మేరకు ఏకో టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా పాలరాపుగుట్టను జటాయు కేంద్రంగా అభివృద్ధి చేయనున్నాం. దీంతో పాటే పర్యాటకులు చుట్టు పక్కల ఉన్న ప్రకృతి అందాలు, టెంపుల్స్‌ను చూసేలా ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించాం. రాబందుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం.
-నీరజ్‌కుమార్ టిబ్రెవాల్, డీఎఫ్‌వో, ఆసిఫాబాద్-
ఇష్టారీతిన డైక్లోఫెనాక్ వాడొద్దు
పశువులకు డైక్లోఫెనాక్ ఇంజక్షన్ వాడకం వల్ల ఆర్గాన్స్ పనిచేయకుండా పోయి, చివరకు పశువులు చనిపోతాయి. పశువుల కళేబరాలు తినే రాబందులకు ఈ ఇంజక్షన్ వల్ల హాని కలుగుతుండడంతో దానిని పూర్తిగా బ్యాన్ చేశాం. మెడికల్ షాపుల్లో సైతం ఇష్టారీతిన ఇవ్వొద్దని చెబుతున్నాం. ఈ ఇంజక్షన్ అమ్మడం అంటే పర్యావరణానికి నష్టం చేసినట్లే. రాబందులను రక్షించాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది. ఇవి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
-శ్రీకాంత్, వెటర్నరీ డాక్టర్-