వీవీపీ నుంచి సెకండరీ హెల్త్‌‌కేర్‌‌‌‌గా మారుస్తున్నం : అజయ్‌‌ కుమార్

వీవీపీ నుంచి సెకండరీ హెల్త్‌‌కేర్‌‌‌‌గా మారుస్తున్నం : అజయ్‌‌ కుమార్
  • అన్ని హాస్పిటళ్లలో స్టాఫ్‌‌ను రీడిప్లయ్‌‌ చేస్తాం
  • ‘వెలుగు’ వార్తపై స్పందించిన వీవీపీ కమిషనర్ అజయ్‌‌ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 70 దవాఖాన్లలో ఒక్క రెగ్యులర్ ఎంప్లాయి కూడా లేరని ‘వెలుగు’ ప్రచురించిన వార్తా కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఆ 70 హాస్పిటళ్లలో డాక్టర్లను సర్దుబాటు చేస్తున్నామని తెలిపింది. ఆ హాస్పిటళ్లన్నీ వైద్య విధాన పరిషత్(వీవీపీ) పరిధిలో ఉన్నాయని వీవీపీ కమిషనర్ అజయ్‌‌కుమార్ వెలుగుకు వివరణ ఇచ్చారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ నుంచి కొన్ని హాస్పిటళ్లు మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లాయని, అందులో నుంచి వీవీపీ డాక్టర్లు, ఇతర స్టాఫ్‌‌ను ఈ 70 దవాఖాన్లలో త్వరలోనే సర్దుబాటు చేస్తామని తెలిపారు. 

వీవీపీ పరిధిలో సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అనే ఒక కొత్త వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తున్నదని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఆస్కి(అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) తయారు చేసి, గురువారం తుది నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను ప్రభుత్వం అనుమతి కోసం పంపించామని అజయ్‌‌ కుమార్ వెల్లడించారు. డాక్టర్లు, నర్సులు సహా మొత్తం 3,428 మంది ఉద్యోగులను అన్ని ఆస్పత్రులలో రీడిప్లాయ్‌‌మెంట్ చేసేందుకు
ప్రభుత్వ అనుమతి కోరామని తెలిపారు.