ముంచెత్తిన వరదలు.. ఏపీకి రూ. 25 లక్షలు విరాళమిచ్చిన అశ్వనీదత్

గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతోంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ వాసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరద నీటితో కీలక రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు బిక్కుబిక్కుమని గడపుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు అందిస్తున్నా.. వర్షం తగ్గుముఖం పెట్టకపోవడంతో పరిస్థితి ఓ కొలిక్కి రావడం లేదు. 

ఇలాంటి కష్టకాలంలో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ముందుకొచ్చింది. తమ వంతుగా ఏ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. 

రాష్ట్రం మాకు చాలా ఇచ్చింది

"వైజయంతీ మూవీస్‌ నిర్మాణ సంస్థ తరుపున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25,00,000/- విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ రాష్ట్రం మాకు చాలా ఇచ్చింది. ఈ కష్టకాలంలో తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని మేము భావిస్తున్నాం.." అని వైజయంతీ మూవీస్‌ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

తెలంగాణకు ఏది..?

రెండు తెలుగు రాష్ట్రాలు.. రెండు కళ్లని చెప్పే సినీ పరిశ్రమ పెద్దలు ఒక రాష్ట్రానికి సాయం ప్రకటించి, మరొక రాష్ట్రానికి ప్రకటించపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం ప్రజల అర్థానాథాలు వైజయంతీ మూవీస్ కు కనిపించలేదా..? అని కొందరు నెటిజన్స్ ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై అశ్వనీదత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.