అక్రమ నియామకాలు, ప్రమోషన్లు రద్దు.. వాడీ వేడిగా టీయూ ఈసీ మీటింగ్ 

డిచ్​పల్లి, వెలుగు:  తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, ప్రమోషన్లు రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వీసీ రవీందర్​ గుప్తా చెక్​ పవర్స్​ను కూడా రద్దు చేసి  ఈసీకి ట్రాన్స్​ఫర్ ​చేసింది. 17 నెలల తరువాత హైదరాబాద్​లోని రూసా రిసోర్స్​ బిల్డింగ్​ లో జరిగిన టీయూ ఈసీ మీటింగ్​ వాడీ వేడిగా జరిగింది. స్టేట్ ​హయ్యర్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ సెక్రటరీ  వాకాటి కరుణ అధ్యక్షతన మీటింగ్​ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కొద్దిసేపటికే బయటకు వెళ్లిపోయిన వీసీ 

ఉదయం 10.30 గంటలకు మీటింగ్​ స్టార్ట్​ అయ్యింది. మీటింగ్​కు వాకాటి కరుణ తో పాటు,  కాలేజ్​, టెక్నికల్​ఎడ్యుకేషన్​కమిషనర్​నవీన్​ మిట్టల్​, స్టేట్​ ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ డిఫ్యూటీ కమిషనర్​ చంద్రకళ, వీసీ రవీందర్ ​గుప్తా, ఈసీ మెంబర్లు హాజరయ్యారు. వీసీ అపాయింట్​ చేసిన రిజిస్ట్రార్​ విద్యావర్ధిని మీటింగ్​ హాల్​లోకి రాగా, మెంబర్స్​ ఆమెను రిజిస్ట్రార్​ గా గుర్తించలేదు. మీటింగ్​ హాల్​ నుంచి  బయటకు పంపించారు. గతంలో ఈసీ నియమించిన ప్రొఫెసర్​ యాదగిరి ని తిరిగి రిజిస్ట్రార్​ గా నియమించారు. ఆయన్ని రెండేళ్ల పాటు ఆ పదవి లో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ విషయంలో  హయ్యర్​ఎడ్యుకేషన్​ఆఫీసర్ల తో వీసీ వాగ్వాదానికి దిగారు. వీసీ తీరుపై ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమి లేక మీటింగ్​ మొదలైన కాసేపటికే ఆయన బయటకు వెళ్లిపోయారు. అయినప్పటికి ఈసీ రూల్స్​ కి అనుగుణంగా వీసీ లేక పోయినా మీటింగ్​ 
కొనసాగింది. 

  కమిటీ ఏర్పాటు 

2021 డిసెంబర్​ 9 న వీసీ ప్రొఫెసర్​ శివశంకర్​ ని రిజిస్ట్రార్​ గా నియమించారు. ఆ రోజు నుంచి నేటి వరకు చేపట్టిన అక్రమ నియామకాలను, ప్రమోషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ లో దాదాపు 130 వరకు ఉద్యోగులను నియమించారని, వారెవరూ గురువారం  నుంచి వర్సిటీ లోకి రావడానికి వీల్లేదని ఆఫీసర్లు ఆదేశించారు. అవసరమైతే కలెక్టర్​, సీపీతో మాట్లాడుతామని చెప్పారు. అలాగే ఇన్ని రోజుల పాటు వారికి ఇచ్చిన శాలరీలు, ప్రమోషన్లతో   అదనంగా శాలరీ పొందిన వారి నుంచి కూడా డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. డిసెంబర్​ 9  నుంచి చేసిన ప్రతి చెల్లింపుని పరిశీలించేందుకు పైవ్​ మెంబర్​ కమిటీ ని ఏర్పాటు చేశారు.  అక్రమాలు, అవినీతి పై అవసరమైతే ఏసీబీతో విచారణ  జరిపించాలన్న అంశం పై   చర్చ జరిగినట్లు తెలిసింది.

2 నెలల పాటు ప్రతి వారం ఈసీ మీటింగ్ 

 టీయూలో జరిగిన అవకతవకల పై ప్రభుత్వం సీరియస్​ గా ఉందని  హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఆఫీసర్లు తెలిపారు. యూనివర్సిటీ ని గాడిలో పెట్టేందుకు ఇక నుంచి  ప్రతి వారం ఈసీ మీటింగ్​ ఉంటుందని చెప్పారు. తర్వాతి మీటింగ్​ ఈ నెల 26 న హైదరాబాద్​ లో జరుగుతుందని పేర్కొన్నారు.