- బంగారం కొనేందుకు కొంచెం ఆగండి..
- రేటు రూ. 40 వేల దిగువకు వచ్చే ఛాన్స్
- బాండ్స్‌పై రాబడి పెరిగినంత కాలం బంగారం చూపు కిందికే
- రాబోయే ఏడాదిలో రూ. 48 వేలకి పెరగొచ్చు
- ఎనలిస్టుల సూచన
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో అన్సెర్టినిటీ....డెట్ మార్కెట్లో తక్కువ రాబడితో విసిగిపోయి...బంగారం కొందామనుకుంటున్నారా...ఇప్పుడే వద్దు...కొంచెం వెయిట్ చేయమంటున్నారు కొంత మంది ఎనలిస్టులు. ఆల్‌టైం హై నుంచి ఇప్పటికే 20 శాతం పతనమైన బంగారం రేటు మరింత దిగి వస్తుందనేది వారి అంచనా. మరి కొంత కాలం ఆగితే పుత్తడి రేటు రూ. 40 వేల (పది గ్రాములు) దిగువకు వస్తుందని కొంత మంది ఎనలిస్టులు చెబుతున్నారు. బాండ్స్‌పై రాబడి పెరగడంతోపాటు, డాలర్ బలపడుతుండటం బులియన్ రేట్లపై వత్తిడి పెరుగుతోంది. దీంతో బంగారం కంటే సావరిన్ బాండ్స్ కొనుగోలువైపే ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇన్ఫ్లేషన్ పెరిగే టైములో సేఫ్టీ ఎక్కువుండే బాండ్స్ వైపు ఇన్వెస్టర్లు చూడటం సాధారణమైనదే. ప్రస్తుతం గోల్డ్ స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లో రూ. 44,500 (పది గ్రాములు) వద్ద ట్రేడవుతోంది. ఆగస్టు 2020 నాటి ఆల్‌టైం హై రూ. 56,000 నుంచి బంగారం రేటు దిగి వచ్చింది. ట్రెండ్ ఇలాగే కొనసాగితే గోల్డ్ రేటు రూ. 40 వేల కిందకి దిగుతుందని ఒక ఎనలిస్టు చెప్పారు.
రేటు పడితే కొనుగోళ్లు పెరుగుతయ్..
బంగారం రేటు రూ. 40 వేల కంటే కిందకు వచ్చినా రావొచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్ కమోడిటీ రీసెర్చ్ ఎనలిస్ట్ వందనా భారతి చెప్పారు. ఇప్పుడు ఎవరూ ఆ రేటు గురించి మాట్లాడటం లేదు, కానీ త్వరలోనే అలా జరిగినా జరగొచ్చని పేర్కొన్నారు. కాకపోతే, ఆ రేటు వద్ద కొనుగోళ్లకు ఎగబడే అవకాశం ఉండటంతో, ఎక్కువ మంది కొనలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పది గ్రాముల బంగారం ఇంతకు ముందు అక్టోబరు 2019లో రూ. 40 వేల దిగువన ట్రేడయింది. ఆ తర్వాత యూఎస్–చైనాల మధ్య ట్రేడ్‌వార్, అనంతరం కోవిడ్ మహమ్మారి కారణాలతో గోల్డ్ రేట్లలో బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది. బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆల్టర్నేటివ్గా కొంత మంది బిట్‌కాయిన్ వైపు చూస్తున్నారు. ఇన్ఫ్లేషన్ను తట్టుకునేందుకు గోల్డ్‌కి ఉన్న సామర్ధ్యం సరిపోదని బ్లాక్‌రాక్ ఫండ్ మేనేజర్ రస్ కోస్టెరిచ్ చెబుతున్నారు. డాలర్ బాగా బలహీనపడితే తప్ప, తాను గోల్డ్‌వైపు చూడనని కోస్టెరిచ్ మార్చి 10న తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అయితే ఉన్న బంగారాన్ని అందరు ఇన్వెస్టర్లూ ఇప్పుడు అమ్మేయడం లేదు. కొంతకాలంపాటు బంగారం రేట్లు ఈ స్థాయిలోనే అటూ, ఇటూ కదలొచ్చని మరి కొంత మంది ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రేటు మరి కొంచెం పడితే, బంగారం కొనుగోలుకు మొగ్గు చూపొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత రాబోయే ఏడాది కాలంలో బంగారం రేటు కొంత పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. వచ్చే 12 నెలల్లో బంగారం రేటు రూ. 47 వేల నుంచి రూ. 48 వేలకు చేరవచ్చని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రిసెర్చ్ హెడ్ రవీంద్ర రావు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ పెంచుతుందనే అంచనాల వల్లే బాండ్స్‌పై రాబడులు పెరుగుతున్నాయి. కానీ, 2023 దాకా వడ్డీ రేట్లు పెంచమని యూఎస్ ఫెడ్ చెబుతోంది. అంటే, వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆశాభావంతోనే బాండ్స్ కొంటున్నారని రావు చెప్పారు. బాండ్స్‌పై రాబడి తగ్గు ముఖం పడితే బంగారం రేటు పెరిగే ఛాన్స్ ఉంటుందని అన్నారు.
బంగారం రేటు ఇంకా తగ్గొచ్చు. ఎందుకంటే, యూఎస్ ట్రెజరీ బాండ్స్ ఈల్డ్‌లు వద్ద ట్రేడవుతున్నాయి. బాండ్స్ ఈల్డ్‌లు మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటే డాలర్ ఇండెక్స్ కూడా పెరగొచ్చు. బహుశా గోల్డ్ రేటు రూ. 42 వేలకి తగ్గుతుంది. ఆ రేటు దగ్గర కొనుక్కోవచ్చు.
- వందనా భారతి, ఎస్‌ఎంసీ గ్లోబల్ కమోడిటీ రిసెర్చ్ ఎనలిస్ట్