ఎన్​డీఎస్​ఏ ఫుల్ రిపోర్టు కోసం వెయిటింగ్​

  • మేడిగడ్డపై ఇప్పటికే మధ్యంతర రిపోర్టు ఇచ్చిన అథారిటీ
  • ఢిల్లీకి వెళ్లి నిపుణుల కమిటీతో భేటీకిస్టేట్ ఇరిగేషన్ అధికారుల నిర్ణయం
  • జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్​పైనా చర్చించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్​పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) ఫుల్ రిపోర్టు రావాల్సి ఉన్నది. వీలైనంత త్వరగా రిపోర్టు తెప్పించుకునేందుకు స్టేట్ ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్, అధికారులతో భేటీ కావాలని నిర్ణయించారు. త్వరగా రిపోర్టు ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జలసౌధలో ఈఎన్సీ నాగేందర్ రావు, రామగుండం ఈఎన్సీ కొట్టె సుధాకర్ రెడ్డి, సీడీవో సీఈ మోహన్ సమావేశమయ్యారు. ఫుల్ రిపోర్టు తెప్పించుకునే విషయమై చర్చించారు. ఈ భేటీకి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్​ఎస్), సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), ఎన్​డీఎస్ఏ ప్రతినిధులు హాజరయ్యారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ పై కూడా ఎన్​డీఎస్ఏ కమిటీ చైర్మన్​తో మాట్లాడాలని స్టేట్ ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. 

మధ్యలోనే ఆగిపోయిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్

మేడిగడ్డ బ్యారేజీ పటిష్టత తెలుసుకునేందుకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని ఎన్​ఏడీఎస్ఏ తన మధ్యంతర నివేదికలో పేర్కొన్నది. ఇన్వెస్టిగేషన్స్ చేసే టైమ్​లో కొన్ని సమస్యలు తలెత్తడంతో సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు వాటిని మధ్యలోనే ఆపేశారు. సమస్యలు వివరిస్తూ.. ప్రత్యామ్నాయం చూపాలని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులు ఎన్​డీఎస్ఏకి లేఖ రాశారు. ఇప్పటి దాకా లెటర్​పై ఎన్​డీఎస్ఏ నుంచి ఎలాంటి సిఫార్సులు రాలేదు. ఇన్వెస్టిగేషన్స్ పూర్తయితే గానీ.. ఫుల్ రిపోర్టు ఇవ్వలేమని ఎన్​డీఎస్ఏ ఇప్పటికే స్పష్టం చేసింది. రెండింటికీ లింకు ఉండటంతో నేరుగా ఢిల్లీకి వెళ్లి ఎన్​డీఎస్ఏ అధికారులతో భేటీ కావాలని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు డిసైడ్ అయ్యారు.

 జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్​కు బదులుకు ఏ టెస్టులు చేయాలో అడగనున్నారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ నుంచి కూడా ఎన్​డీఎస్ఏ ఫుల్ రిపోర్టుపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి వరద తాకిడి పెరగడంతో ప్రత్యామ్నాయ టెస్టులు కష్టమే అన్న చర్చ జరుగుతున్నది. నవంబర్ నాటికి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తామని అధికారులు చెప్తున్నరు. కానీ.. మూడు బ్యారేజీల గేట్లు ఎత్తి పెట్టాలని ఇప్పటికే ఎన్​డీఎస్ఏ తన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ఎత్తిపోతలు కూడా కష్టమే అన్న చర్చ ఇరిగేషన్ అధికారుల్లో జరుగుతున్నది.