44 గంటలపైనే వెయిటింగ్.. తుర్కియే ఎయిర్​పోర్టులో చిక్కుకుపోయిన 250 మంది ప్యాసింజర్లు

44 గంటలపైనే  వెయిటింగ్.. తుర్కియే ఎయిర్​పోర్టులో చిక్కుకుపోయిన 250 మంది ప్యాసింజర్లు
  • లండన్  నుంచి ముంబైకి వస్తున్న విమానంలో టెక్నికల్  సమస్య
  • తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియాలో ఆవేదన

లండన్: విమానంలో సాంకేతిక సమస్యతో 250 మంది ప్రయాణికులు తుర్కియేలోని దియార్ బకిర్  ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. వారిలో చాలామంది భారతీయులే ఉన్నారు. వర్జిన్  అట్లాంటిక్  ఎయిర్ వేస్ కు చెందిన విమానం ఈ నెల 2న లండన్  నుంచి ముంబైకి బయల్దేరింది. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ముంబైలో ల్యాండ్  కావాల్సి ఉంది. 

అయితే, మెడికల్  ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్ ను తుర్కియేలోని దియార్ బకిర్  ఎయిర్ పోర్టులో దించారు. ల్యాండింగ్  తరువాత ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు 44 గంటలపైనే విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. సమస్యను పరిష్కరించేందుకు తమ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని వర్జిన్  అట్లాంటిక్  ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులను బస్సులో శనివారం టర్కిష్​ ఎయిర్ పోర్టుకు తరలిస్తామని, అక్కడి నుంచి ముంబైకి పంపించేందుకు ప్రత్యామ్నాయ ఫ్లైట్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాత్రిపూట ప్యాసింజర్లకు హోటళ్లలో వసతి సౌకర్యాలు సమకూరుస్తామని వివరించారు.

విమానాశ్రయంలో నరకం అనుభవిస్తున్నాం: ప్రయాణికులు

దియార్ బకిర్  విమానాశ్రయంలో  వసతి సౌకర్యాలు లేకపోవడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ బాధలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ‘‘ఎయిర్ పోర్టులో ఒకే ఒక్క టాయిలెట్  ఉంది. 300 మందికి ఒక్క టాయిలెట్  ఏం సరిపోతుంది? చలి కూడా ఎక్కువగా ఉంది. మాకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదు” అని ప్యాసింజర్లు మండిపడ్డారు. చాలామంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే సీట్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకున్న దృశ్యాలు కనిపించాయి.