- ఉమ్మడి జిల్లాలో 15,169 మంది ఎదురుచూపులు
- అప్లికేషన్లను ఏండ్ల పాటు పెండింగ్‌లో పెట్టిన గత సర్కార్
- భూమిపై హక్కులు దక్కక రైతులు పరేషాన్
- రైతుబంధు, బీమా, సబ్సిడీలకు దూరం
- కొత్త గవర్నమెంట్పైనే ఆశలు
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో చాలామంది రైతులు ఏండ్లుగా సాదాబైనామా రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. తెల్ల కాగితం, స్టాంప్ పేపర్లపై జరిగిన పంట భూముల అమ్మకాలకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని గత బీఆర్ఎస్ అర్జీలు స్వీకరించింది. కానీ వాటిని పరిష్కరించకుండా ఏండ్ల పాటు పెండింగ్‌లో పెట్టింది. రికార్డులో పేరు లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా, పంట బీమా, విత్తన సబ్సిడీ తదితర బెనిఫిట్స్‌కు సాగుదారులు దూరమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అంశాలను ఒక్కోటిగా సెటిల్ చేస్తున్న నేపథ్యంలో తమ సాదాబైనామా అంశంపై కూడా దృష్టి సారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మొత్తం దరఖాస్తులు 36,787
తెలంగాణ ఏర్పాటుకు ముందు సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 2020, నవంబరులో దరఖాస్తులు తీసుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఓనర్లుగా నమోదు చేస్తామని తెలపడంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 36,787 అప్లికేషన్లు వచ్చాయి. తర్వాత ఆర్ఐ, వీఆర్వోలు ఫీల్డ్ విజిట్ చేసి అసలైన లబ్ధిదారులను గుర్తించారు. పొరుగు పట్టాదారులు, మోకా పంచనామా, భూమి రకాన్ని (గవర్నమెంట్, వక్ఫ్, దేవాదాయ శాఖకు చెందని ల్యాండ్స్ మాత్రమే) నిర్ధారించారు.
గ్రామాల వారీగా ప్రతి అప్లికేషష్లను వడపోసి 21,618 అర్జీలను రిజక్ట్ చేశారు. మిగిలిన 15,169 అప్లికేషన్లను సాదాబైనామా కింద ఆమోదించొచ్చని తేల్చారు. గవర్నమెంట్ ఆదేశాలిస్తే లబ్ధిదారులకు పాస్‌బుక్స్ అందజేయాలనే ఆలోచనతో అంతా రెడీ చేశారు. అయితే ఎల్ఆర్ఎస్ (నాన్ లేఅవుట్ ప్లాట్ల రిగ్యులైజేషన్) తరహాలో సాదాబైనామా ఆర్జీలూ తీసుకున్న బీఆర్ఎస్ పాలకులు పక్కన పెట్టేశారు.
లబ్ధికి దూరం..
రిజిస్ట్రేషన్ ఖర్చు తప్పించుకోడానికి గ్రామాల్లో తెల్లకాగితం, స్టాంప్ పేపర్స్‌పై (సాదాబైనామా) భూముల క్రయవిక్రయాలు చేస్తారు. పదేండ్ల కిందటి వరకు ఈ పద్ధతే ఉండేది. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందాలు చేసుకోవడంతో అనధికారంగా అమ్మకాలు చెల్లుబాటు అయ్యేవి. కొనుగోలుదారులు భూమిని స్వాధీనం చేసుకొని పంటలు పండించడంతో వారే యాజమానులుగా వ్యవహరించేవారు.
కానీ చట్టం ప్రకారం కొనుగోలు చేసిన భూమి స్వాధీనంలో ఉండి అఫీషియల్‌గా రెవెన్యూ రికార్డులో రైతు పేరు ఎంటరై పాస్‌బుక్ ఉంటేనే ల్యాండ్ ఓనర్‌గా పరిగణిస్తారు. సాదాబైనామా కింద కొనుగోలు చేసిన రైతుల పేర్లపై భూమి రికార్డులు మారకపోవడంతో వారు పంట పెట్టుబడి సహాయం రైతుబంధుకు రావడం లేదు. ధరణిలోనూ వీరి పేర్లు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ అంశాన్ని టేకప్ చేసినందున సాదాబైనామా దరఖాస్తులపై కూడా నజర్ పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.