జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ‘నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే ప్రెగ్నెంట్ అయ్యాను.. కోటి రూపాయలు ఇస్తే నాకు ఓకే.. ఎవరికి ఏం చెప్పను.. లేకపోతే కేస్ పెట్టి పరువు తీస్తా.. నీ పెళ్లి కాకుండా అడ్డుకుంటా’ అని యువతి భయపెట్టడంతోనే తీవ్ర మనస్తాపం చెంది వాజేడు ఎస్ఐ సూసైడ్‌కు పాల్పడినట్టు పోలీసుల ఎంక్వైరీలో వెల్లడైనట్టు తెలిసింది. గత సోమవారం ఉదయం వాజేడు రిసార్ట్స్ రూమ్‌లో ఎస్ఐ హరీశ్తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన సమయంలో ఆయనతో ఉన్న యువతి అనంతరం పరారైంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు తెలిసినట్టు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆ యువతి కొంతకాలం కింద ఎస్ఐ హరీశ్‌కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై.. అనంతరం అతనికి దగ్గరైనట్టు తెలిసింది. ప్రేమ పేరుతో నటించి ఎస్ఐతో శారీరక సంబంధం పెట్టుకుని, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందే ఆమె సూర్యాపేట జిల్లా చిలుకూరు పీఎస్, కోదాడలో, హైదరాబాద్ ఎల్ బీ నగర్, హయత్ నగర్ పీఎస్ పరిధిలో కూడా మోసం చేశారని పలువురిపై ఆమె కేసులు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. కాగా.. హరీశ్సూసైడ్ ఘటన జరగడానికి ఒకరోజు ముందు ఆమె మరో వ్యక్తితో కలిసి వాజేడుకు వచ్చినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.
ఎస్ఐ హరీశ్‌కు వేరే యువతితో పెండ్లి సంబంధం కుదరడంతో అతడిని బెదిరిస్తే డబ్బులు బాగా వస్తాయని ప్లాన్ చేసి ఆదివారం రాత్రి రిసార్ట్స్‌లో ఎస్ఐతో గడిపి, సోమవారం ఉదయం తన ప్లాన్ వర్క్ ఔట్ చేసుకునేందుకే గొడవ పడినట్టుగా తెలిసింది. ఆమె ఎస్ఐను రూ. కోటి డిమాండ్ చేయగా.. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకోగా.. ఆమె ససేమిరా అంటూ.. గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్ఐ ఆమెను బయటకు పంపించి, అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని’ పోలీసుల ఎంక్వైరీలో తేలినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ములుగు ఎస్పీ శబరీశ్‌ను వివరణ కోరగా.. ఎస్ఐ హరీశ్ సూసైడ్‌కు.. ఆ యువతికి మధ్య సంబంధం ఉన్నట్టు ఆరోపిస్తూ హరీశ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. ఆ కోణంలోనే ఎంక్వైరీ చేస్తున్నామని ఒకటి, రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ చెప్పారు.