బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కు క్యాన్సర్

బ్రిటన్ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని వీడియో సందేశం ద్వారా ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్నారు కేట్‌.  ఈ శస్త్రచికిత్స తర్వాత చేసిన పరీక్షల్లో తనకు క్యాన్సర్‌ ఉందని తేలినందని.. దీంతో  ప్రివెంటివ్‌ కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు యువరాణి కేట్‌ శుక్రవారం తెలిపారు.

ఇది మమ్మల్నీ చాలా షాక్ కు గురిచేసిందన్నారు కేట్. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. మరింత బలపడుతున్నానని చెప్పారు. తన వైద్య బృందం కీమోథెరపీ కోర్సు చేయించుకోవాలని సలహా ఇచ్చిందని.. దీంతో తాను చికిత్స పొందుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తన చికిత్స ప్రారంభ దశలో ఉందని ఆమె చెప్పారు.

కాగా, కేట్‌ మిడిల్టన్‌కు సర్జరీ అయిన విషయాన్ని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరి 17న వెల్లడించింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది. 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తెలిపింది. అప్పటి నుంచి ఆమె కనిపించకపోవడంతో  కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton)పై సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. సర్జరీ సమయంలో యువరాణికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారనే ప్రచారం జరిగింది.  

ఇదిలాఉంటే, బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్‌ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఇటీవల వెల్లడించింది. దీంతో ఆయనకు చికిత్స పొందుతున్నారని తెలిపింది. యువరాణి కేట్‌ (Kate Middleton)కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు సమాచారం.