![సముద్రంలో 12 గంటలు.. 45 కిలోమీటర్ల నడక.. దారిలో శవాలు.. ఇన్ని తిప్పలు పడ్డారా..?](https://static.v6velugu.com/uploads/2025/02/walked-45-kilometres-saw-bodies-on-the-way-indians-deported-from-us_rh9Kn6zjI8.jpg)
ఢిల్లీ: అమెరికా నుంచి 104 మంది భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ చేతులకు సంకెళ్లు వేసి మరీ భారత్కు తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వారిని భారత్కు ఆర్మీ విమానంలో తరలించింది. ఈ 104 మందిలో 19 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
టెక్సాస్ నుంచి వచ్చిన సీ-17 మిలటరీ విమానం పంజాబ్లోని అమృత్‌సర్‌లో ఉన్న శ్రీ గురు రామ్‌దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ల్యాండ్ అయింది. ఈ 104 మందిని తనిఖీలు చేసిన తర్వాత వారిని ఇండ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. ఇలా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరిమేసిన భారతీయులు వారికి ఎదురైన దయనీయ పరిస్థితులను, అవమానాలను తల్చుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని భయానక దృశ్యాలను కూడా కళ్లారా చూశామని వివరించారు.
అమెరికా ఆర్మీ విమానంలో వచ్చిన వాళ్లలో ఒకరైన.. పంజాబ్లోని గురుదాస్పూర్ ప్రాంతానికి చెందిన జస్పాల్ సింగ్ ఇండియాకు చేర్చే క్రమంలో అమెరికా ప్రవర్తించిన తీరును బయటపెట్టాడు. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేసి తమను తరలించారని, తమను మరో క్యాంపుకు తరలిస్తున్నారేమోనని అంతా భావించామని చెప్పాడు. కానీ.. ఇండియాకు తరలిస్తున్నామని పోలీస్ అధికారి ఒకరు చెప్పారని తెలిపాడు.
Also Read :- స్కూల్ ముందే భార్యను 8 సార్లు పొడిచిన భర్త
అమృతసర్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న తర్వాతే ఆర్మీ విమానంలో ఉన్న తమకు సంకెళ్లు, గొలుసులు తొలగించారని చెప్పాడు. భారతీయులను గొలుసులతో కట్టేసి, చేతులకు సంకెళ్లేసి తరలించారని ఒక ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అయితే.. ఆ ఫొటోలో ఉన్నది భారతీయులు కాదని గ్వాటెమాలా దేశస్తులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక.. పంజాబ్లోని దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ అక్రమంగా అమెరికా చేరుకోవడానికి పడిన వ్యయప్రయాసలను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఎవరూ వెళ్లొద్దని హితవు పలికాడు. 15 గంటల పాటు సముద్ర మార్గంలో ప్రయాణం చేసి.. 40 నుంచి 45 కిలోమీటర్ల పాటు హిల్స్లో నడిచి వెళ్లానని చెప్పాడు. దారిలో ఎవరైనా గాయపడితే ఇక చావే శరణ్యమని.. ఇలా చనిపోయిన వారి మృతదేహాలు దారి పొడవునా చాలానే కనిపించాయని భయానక పరిస్థితులను సింగ్ గుర్తుచేసుకున్నాడు.
మెక్సికో బోర్డర్ లోకి ఎంటర్ అవుతున్న టైంలో మెక్సికో పోలీసులకు సుఖ్ పాల్ సింగ్ దొరికిపోయాడు. అతనిని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు చీకటి గదిలో ఉంచారు. ఆ 14 రోజుల పాటు కనీసం సూర్యుడిని కూడా చూడలేదని.. అంత కటిక చీకట్లో బాధలు అనుభవించామని.. ఆ చీకటి గదుల్లో వేల సంఖ్యలో మగ్గిపోతున్న పంజాబీ యువకులను, కుటుంబాలను, చిన్నారులను చూసి దు:ఖం ఆగలేదని సుఖ్ పాల్ సింగ్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇలా అక్రమ మార్గం ద్వారా అమెరికాకు ఎవరూ వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాడు.