కాంగ్రెస్​ మెంబర్ల వాకౌట్​.. మీడియాకు నో ఎంట్రీ

  • అజెండాలో16 అంశాలపై తీర్మానం చేసినట్లు మేయర్​ప్రకటన 
  • మీటింగ్​లో వివరాలన్నీ గోప్యం 
  • కౌన్సిల్​ సమావేశానికి  పోలీస్​ బందోబస్త్​

ఖమ్మం ​కార్పొరేషన్​, వెలుగు: అత్యంత కట్టుదిట్టమైన పోలీసుల భద్రత మధ్య ఖమ్మం మున్సిపల్ ​కార్పొరేషన్​​ కౌన్సిల్​మీటింగ్​ బుధవారం జరిగింది. మేయర్​ పునుకొల్లు నీరజ అధ్యక్షతన జరిగిన మీటింగ్​ను కాంగ్రెస్​ కార్పొరేటర్లు వాకౌట్​ చేయడం, రూలింగ్​ పార్టీ ప్రజాప్రతినిధులే తీర్మానాలు చేసేశారు. జీవో  నం.216ను చూపి మీటింగ్​కు మీడియాకు అనుమతి నిరాకరించారు. దీంతో కౌన్సిల్​ మీటింగ్ లో ఏం జరిగిందో అంతా సీక్రెట్​గానే ఉంది. మీటింగ్​ జరుగుతున్నంత సేపు మున్సిపల్​ కార్పొరేషన్​ బిల్డింగ్​ మెయిన్​గేట్​ అవుట్​పోస్ట్​ వద్ద, లోపల గేటు, కౌన్సిల్​ హాల్​ వద్ద పోలీసులను మోహరించారు. ఇలా పోలీసుల బందోబస్తు మధ్య మీటింగ్​ నిర్వహించడం చర్చనీయాంశమైంది. మీటింగ్​స్టార్టయిన కాసేపటికే కాంగ్రెస్​ కార్పొరేటర్లు నలుగురు వాకౌట్​బయటకు వచ్చారు.  కౌన్సిల్​ మీటింగ్​లో అజెండాలోని 16 అంశాలపై చేసిన తీర్మానాలను సభ్యులందరూ ఆమోదించినట్లు మేయర్​ పునుకొల్లు నీరజ మీడియాకు సమాచారమిచ్చారు. ఈ మీటింగ్​లో ఎమ్మెల్సీ తాత మధుసూదన్​ ఎక్స్​అఫీషియో మెంబర్​గా ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ నిధులను ఖమ్మం అభివృద్ధికి కేటాయించాలని మేయర్​ నీరజ .. తాతా మధుసూదన్​ను కోరారు. 

కాంగ్రెస్​ కార్పొరేటర్లు వాకౌట్​...

మీటింగ్​ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష కాంగ్రెస్​ సభ్యులు సభను వాకౌట్​ చేసి బయటకు వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. తమ డివిజన్​లలోని సమస్యలను గత మీటింగ్​లలో ప్రస్తావించగా నేటికీ వాటిని పరిష్కరించలేదన్నారు. పాలకవర్గం సొంత ఎజెండా ప్రకారం నడుచుకుంటోందని, ప్రతిపక్షాల డివిజన్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమ డివిజన్ల సమస్యలు కౌన్సిల్​ దృష్టికి తీసుకువస్తే పట్టించుకోవడం లేని కాంగ్రెస్ ​కార్పొరేటర్లు వాపోయారు. మీకు ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.