హైదరాబాద్ లో రన్నింగ్​ ఆటోపై కూలిన గోడ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో రన్నింగ్​ ఆటోపై కూలిన గోడ..  ఇద్దరికి తీవ్ర గాయాలు

దిల్​సుఖ్ నగర్, వెలుగు: రన్నింగ్​లో ఉన్న ఆటోపై ప్రహరీ గోడ కూలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సరూర్ నగర్ పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. కర్మన్ ఘాట్ శ్రీనివాస కాలనీకి చెందిన నేనావత్ అనిల్, సరోజ, భానుప్రసాద్, అమరావతి, ఆరాధ్య, నందిని కుటుంబసభ్యులు. గురువారం తుర్కయంజాల్​లో తమ బంధువుల ఫంక్షన్​ఉండడంతో ఆటోలో బయలుదేరారు. 

అయితే, కర్మన్​ఘాట్ సుమంగళి గార్డెన్ వెనుక గల్లీలో జేసీబీతో ప్రహరీ గోడ వెంట మట్టిని చదును చేస్తున్నారు. ఈ క్రమంలో జేసీబీ బొక్కెన గోడకు తగలడంతో ఒక్కసారిగా రన్నింగ్ ఆటోపై కూలింది. దీంతో ఆటోలోని సరోజ, అనిల్ కు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. 

బాధితుల ఫిర్యాదుతో జేసీబీ డ్రైవర్ మహేందర్, సైట్ సూపర్ వైజర్ కృష్ణారెడ్డిపై సరూర్ నగర్​పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో 
రికార్డయ్యాయి.