జగిత్యాల, వెలుగు : ‘మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. మంత్రాలు చేసే వాళ్లని ఒక్కొక్కరిని చంపబోతున్నాం’ అంటూ వెలసిన వాల్‌పోస్టర్లు జగిత్యాల జిల్లాలో కలకలం రేపాయి. మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ్రామంలోని గచ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ పోస్టర్లు అతికించారు.
వారికి సపోర్ట్ చేసే వారిని వదిలిపెట్టబోమని, తాము ప్రజల మంచి కోరే సంస్థకు చెందిన వారిమంటూ పోస్టర్లో పేర్కొన్నారు. వాల్‌పోస్టర్ల విషయం వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లు ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేశారా ? లేక ఎవరైనా ఆకతాయిలా పనా ? అనేది తేలాల్సి ఉంది.