నల్గొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై చందంపల్లి దగ్గర కోమటిరెడ్డి కోవర్ట్ రెడ్డి అంటూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. చందంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. మొత్తం 13 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పోస్టర్లలో డిమాండ్ చేశారు.
1. స్వంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలలో సర్పంచ్ మరియు యంపిటిసిలని గెలిపించుకోలేని అసమర్థుడు.
2. స్వంత సోదరున్ని నార్కట్పల్లి జడ్పీటిసిగా గెలిపించుకోలేని అసమర్థుడు.
3. 20 వార్డులు ఉన్న నకిరేకల్ మున్సిపాల్టీలో 2 వార్డులు మాత్రమే గెలిచింది. దీనికి కారణం ఎవరు?
4. చిట్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత యునానిమస్ ఏలా అవుతాడు? దీనికి కారణం ఎవరు?
5. స్థానిక సంస్థల ఎమ్మెస్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ జడ్పీటిసి కుడుదుల నగేష్ ఎమ్మేల్సీ అభ్యర్థిగా ఉంటానంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదు ?
6. నకిరేకల్ నియోజకవర్గములోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్వత్వాలు ఎన్ని చేయించారు.
7. మునుగోడు ఉప ఎన్నికలలో బి.జె.పి అభ్యర్థి తరుపున ప్రచారం చేసిన నకిరేకల్ నియోజకవర్గంలోని నీవు నియమించిన మండల పార్టీ అధ్యక్షులపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు. దీనికి కారణం ఏవరు?
8. నల్లగొండ జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందుకు లేదు?
9. గతంలో బిసి వర్గానికి చెందిన స్వామిగౌడ్, మల్లేష్ గౌడ్, భిక్షమయ్య గౌడ్ ను జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న కాని వీరిని అనేక ఇబ్బందులకు గురి చేసి పార్టీ నుండి వెళ్ళిపోయే విధముగా చేసింది నీవు కాదా?
10. స్వంత కుటుంబ సభ్యుల్ని గెలిపించుకోలేని నీవు స్టార్ క్యాంపెయినర్ కి అర్హునివా?
11. స్వంత తమ్ముడైన రాజగోపాల్రెడ్డిని మరియు అధిష్టానంపై ఒత్తిడి చేసి టిక్కెట్ ఇప్పించిన చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతుంటే ఆపగలిగావా? దీనికి కారణం ఏంది?.
12. అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీస్లను చెత్త బుట్టలో వేసిన అని నీవు అధిష్ఠానాన్ని అగౌరవ పర్చలేదా?
13. 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మెంబర్ షిప్ లో నీకు సభ్యత్వం ఉన్నదా?
వీటి అన్నింటికి కారణం ఏవరు?