జగిత్యాల: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. మంత్రాలు చేసే వాళ్ళని ఒక్కొక్కరిని చంపబోతున్నామంటూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు జగిత్యాల జిల్లాలో కలకలం రేపాయి. వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిలాఫలకానికి మంత్రాలు చేసేవాళ్లను హెచ్చరిస్తూ వాల్ పోస్టర్లు అంటించారు. గ్రామంలోని పలానా చోటు నుండి ఇద్దరు వ్యక్తులతో ఈ పని మొదలు పెట్టి.. మిగతా వాడల్లో ఉన్న మంత్రాలు చేసే వారందరినీ చంపేస్తామంటూ వాల్ పోస్టర్లో ఎరుపు రంగు అక్షరాలతో రాశారు.
మంత్రగాళ్లకు సపోర్టు చేసే వారిని కూడా వదిలిపెట్టబోమని.. తాము ప్రజల మంచి కోరే సంస్థకు చెందిన వ్యక్తులమని పోస్టర్లో పేర్కొన్నారు. ఈ వాల్ పోస్టర్ వ్యవహరం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వాల్ పోస్టర్లు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారా..? లేక ఎవరైనా ఆకతాయిల చేశారా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం