పేపర్​ బాయ్​ పెట్టిన సూపర్​ మార్కెట్​ వాల్ మార్ట్

పేపర్​ బాయ్​ పెట్టిన సూపర్​ మార్కెట్​ వాల్ మార్ట్

ఒకప్పుడు గుండుసూది నుంచి గడ్డపార వరకు​.. మసాలా దినుసుల నుంచి మంచినూనె, ఆకుకూరలు, కూరగాయలు.. ఇలా ఇంట్లోకి అవసరమైన అన్ని వస్తువులూ సంతల్లోనే దొరికేవి. అక్కడక్కడా కిరాణా దుకాణాలున్నా వాటిల్లో కొన్ని మాత్రమే ఉండేవి. ఆ తర్వాత కావాల్సిన వస్తువులన్నిటినీ ఒకేచోట అమ్మడం మొదలుపెట్టింది ‘వాల్​మార్ట్​’. ఇది మార్కెట్​లాంటి కిరాణా కొట్టు. ప్రపంచంలోనే మొదటి రిటైల్​ స్టోర్​. దీన్ని పెట్టింది, నెం.1గా చేసింది సామ్ వాల్టన్​​. పాలు, పేపర్లు అమ్మడంతో మొదలై ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్​ స్టోర్​కు యజమానిగా ఎదగడం వెనక ఆయన పడిన కష్టాలు, వాటిని తన తెలివితేటలు, పట్టుదల, శ్రమతో దాటుకొని కుబేరుడిగా మారిన తీరు తెలుసుకుందాం.   

అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో ఉన్న ‘కింగ్​ఫిషర్​’ అనే ఊళ్లో మార్చి 29, 1918లో పుట్టాడు సామ్​ వాల్టన్​. అసలు పేరు సామ్యూల్​ మూర్​ వాల్టన్​. అతనికి ఒక తమ్ముడు జాన్సన్ ఉన్నాడు. వీళ్ల తల్లిదండ్రులు థామస్​ గిబ్సన్​ వాల్టన్​, నాన్సీ లీ. వీళ్లది పేద రైతు కుటుంబం. వ్యవసాయంలో వచ్చే ఆదాయం చాలక థామస్​ గిబ్సన్​ ఒక సాధారణ రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో పంటలు పండించేవాడు. అయితే, వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. దాంతో 1923లో పొలం అమ్మేసి సొంతూరు వదిలిపెట్టాడు. ఆ తర్వాత కొన్నేండ్లపాటు చాలా ఊర్లకు మకాం మార్చాడు. దొరికిన పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. చివరికి కొలంబియా రాష్ట్రంలోని మిస్సోరీ నగరానికి చేరుకున్నాడు. అక్కడ తన అన్న పెట్టిన ‘వాల్టన్​ మోర్టగేజ్​’ అనే ఇన్సూరెన్స్​ కంపెనీలో చేరాడు.   

పాలు, పేపర్లు అమ్మి..

కుటుంబం కోసం తండ్రి ఊళ్లు తిరగడం సామ్​ వాల్టన్​పై తీవ్ర ప్రభావం చూపింది. తాను కూడా ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలని చిన్నప్పుడే అనుకున్నాడు. దాంతో పొద్దున్నే ఇంటింటికీ తిరిగి పేపర్లు వేయడం మొదలుపెట్టాడు. అలాగే తమ ఇంటికి ఆసరాగా ఉన్న ఆవుల పాలు పితికి, బాటిళ్లలో పోసి అమ్మేవాడు. ఇంకా రకరకాల పార్ట్​ టైమ్​ ఉద్యోగాలు చేసేవాడు. పనుల్లో పడి చదువును వదిలిపెట్టలేదు. స్కూల్లో చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవాడు. ముఖ్యంగా ‘స్కౌట్స్’​లో ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఎనిమిదో తరగతిలో ఉండగా రాష్ట్ర స్థాయిలో ‘యంగెస్ట్​ ఈగిల్​ స్కౌట్’గా రికార్డు​లకు ఎక్కాడు. అలాగే ‘మోస్ట్​ వెర్సటైల్​ బాయ్​’గా ఎంపికయ్యాడు. 

ఉద్యోగం.. మిలటరీ

యూనివర్సిటీ ఆఫ్​ మిస్సోరీలో1940లో బీఏ(ఎకనామిక్స్​)లో చేరాడు. డిగ్రీ పూర్తయ్యాక డెస్​ మోనిస్​ నగరంలోని జె.సి. పెన్నీ కంపెనీలో అకౌంటెంట్​ ఉద్యోగం సంపాదించాడు. అయితే, రెండో ప్రపంచయుద్ధం మొదలైన కొన్ని నెలలకే ఉద్యోగం వదిలేసి సైన్యంలో చేరాడు. ఏ పనిలో చేరినా కష్టపడడంలో, బాధ్యత తీసుకోవడంలో ముందుండే లక్షణం వల్ల కొద్ది రోజుల్లోనే ‘కెప్టెన్’​ ర్యాంక్​ హోదాకు చేరుకున్నాడు.1943లో హెలెన్​ రాబ్సన్​ను పెండ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు సామ్యూల్​ రాబ్సన్​, జాన్ థామస్​, జేమ్స్​ కెర్​, అలిస్​ లూసీ.1945 వరకు మిలటరీలో పనిచేసిన వాల్టన్​, యుద్ధం ముగిశాక రిటైర్​ అయ్యాడు.  

మొదటి కంపెనీ

మిలటరీ నుంచి వచ్చాక తిరిగి జాబ్​లో చేరడానికి ఇష్టపడలేదు వాల్టన్. సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాడు. అప్పుడే అతనికి ‘న్యూపోర్ట్’​ సిటీలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ‘బెన్​ ఫ్రాంక్లిన్​’ స్టోర్​ గురించి తెలిసింది. అది బట్లర్​ బ్రదర్స్​ ఫ్రాంఛైజీలోని స్టోర్​. దాన్ని కొనడానికి తన మామ దగ్గర20వేల డాలర్లు అప్పుగా తీసుకొన్నాడు.  ఆ సొమ్ముకు తాను కూడబెట్టిన 5వేల డాలర్లు జత చేసి స్టోర్​ను కొన్నాడు. అప్పటికి అతడికి 26 ఏండ్లు. బిజినెస్​లో తమ్ముడిని కూడా చేర్చుకున్నాడు​. స్టోర్​ను డెవలప్​ చేయడానికి ఇద్దరూ చాలా కష్టపడ్డారు. అప్పటివరకు స్టోర్​లో కేవలం కొన్ని రకాల ప్రొడక్ట్స్​ మాత్రమే అమ్ముతుండగా, వాటికి మరిన్ని జత చేశారు. దాంతో మూడేండ్లలోనే స్టోర్​ ఆదాయం బాగా పెరిగింది.1960 నాటికి ఏకంగా15 స్టోర్లు తెరిచారు. కంపెనీ మెయిన్​ స్టోర్​ను, హెడ్​క్వార్టర్స్​ను  బెంటోవిల్లే సిటీకి మార్చారు. 

ఆ ఆలోచనే వాల్​మార్ట్​కు పునాది

అప్పటివరకు పెద్ద నగరాలకే పరిమితమైన స్టోర్స్​ను చిన్న టౌన్​లలో మొదలుపెట్టాలని అనుకున్నాడు వాల్టన్​. అయితే, అతని ఆలోచనకు ‘బట్లర్​ బ్రదర్స్​ ఫ్రాంఛైజీ’ ఒప్పుకోలేదు. దాంతో విడిగా మరొక రిటైల్​ స్టోర్​ పెట్టాలనుకున్నాడు​. అలా1962లో అర్కన్సాస్​లోని ‘రోజర్స్’ అనే చిన్న టౌన్​లో మొదటి వాల్​మార్ట్​ స్టోర్​ మొదలైంది. దానికి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్​ వచ్చింది. దాంతో బిజినెస్​ను మరింత డెవలప్​ చేయాలనుకున్నాడు వాల్టన్​. వాల్​మార్ట్​ స్టోర్స్​లో డిస్కౌంట్స్​ ఇవ్వడం మొదలుపెట్టాడు. దానికితోడు స్టోర్​కు అవసరమైన వస్తువులు తీసుకురావడానికి వెహికల్స్​ కొన్నాడు. అవి నేరుగా కంపెనీలు, పొలాల వద్దకు వెళ్లి ప్రొడక్ట్స్​ తెచ్చేవి. దాంతోపాటు ఆ ప్రొడక్ట్స్​కు కొంచెం తక్కువ ధరలు పెట్టారు. డిస్కౌంట్స్​, తక్కువ ధర ట్రిక్స్​ పనిచేయడంతో వాల్​మార్ట్​ స్టోర్స్​కు డిమాండ్​ బాగా పెరిగింది. ఆదాయం ఎక్కువైంది. 1975లో ‘వాల్​మార్ట్’​ కంపెనీ పేరు న్యూయార్క్​ స్టాక్​ ఎక్స్ఛేంజ్​లోకి చేరింది. అలాగే  అమెరికాలోని దాదాపు అన్ని టౌన్లు, నగరాల్లో కంపెనీ స్టోర్స్​ మొదలయ్యాయి. 1987 నాటికి ప్రపంచవ్యాప్తంగా1198 లొకేషన్స్​లో వాల్​మార్ట్​ స్టోర్స్​ మొదలయ్యాయి.  ప్రస్తుతం కంపెనీలో సుమారు 23 లక్షల మంది పనిచేస్తున్నారు. అలాగే కంపెనీ బ్రాండ్​ విలువ 30 బిలియన్​ డాలర్లు. ఆదాయం 341 బిలియన్​ డాలర్లు. అనారోగ్యంతో సామ్​ వాల్టన్​ 1992లో చనిపోయాడు. 

‘టైమ్స్​’ లిస్ట్​లో

అమెరికా అభివృద్ధిలో వాల్​మార్ట్​ పాత్ర చాలా ముఖ్యమైంది. అందుకే 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల గురించి టైమ్స్​ మ్యాగజైన్​ 1998లో విడుదల చేసిన లిస్ట్​లో సామ్​ వాల్టన్​కు చోటు దక్కింది. అలాగే 1992లో అమెరికా అధ్యక్షుడు జార్జ్​ హెచ్​.డబ్ల్యూ.బుష్​(సీనియర్) నుంచి ‘ప్రెసిడెన్షియల్​ మెడల్​ ఆఫ్​ ఫ్రీడమ్​’ అవార్డు కూడా  అందుకున్నాడు వాల్టన్​.  ఫోర్బ్స్​ లిస్ట్​ ప్రకారం 1982 నుంచి 1988 వరకు అమెరికాలో నెం.1 ధనవంతుడు సామ్​ వాల్టన్​. వాల్​మార్ట్​ మొదటి లోగోను 1962లో తయారుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరుసార్లు లోగో డిజైన్​లో మార్పుచేశారు. అయితే, అన్నింటిలోనూ ఇంగ్లీష్​ అక్షరాల్లోని ‘వాల్​మార్ట్​’ పదం కామన్​గా ఉంటుంది. మొదటి లోగోలో, ఇప్పటి లోగోలో మాత్రం వాల్​మార్ట్​ పదం కలిసిపోయి ఉంటుంది. అయితే, మిగిలిన లోగోల్లో వాల్​, మార్ట్ పదాల మధ్య గీత లేదా స్టార్​ గుర్తు ఉంటుంది. ఇప్పటి లోగోలో ‘వాల్​మార్ట్​’ పదం కింద ‘సేవ్​ మనీ. లివ్​ బెటర్​’ అనే స్లోగన్​ ఉంటుంది.