
వనపర్తి, వెలుగు: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్నిరకాలుగా సహకరించి సాధారణ పిల్లలకు దీటుగా తీర్చిదిద్దడమే భవిత కేంద్రం లక్ష్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం ఎంఈవో ఆఫీస్‌లోని భవిత కేంద్రంలో విద్యా శాఖ, సమగ్ర శిక్ష, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచితంగా ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, క్లచర్స్, వినికిడి పరికరాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిత కేంద్రంలోని 69 మంది పిల్లలను గుర్తించామని, భవిత కేంద్రంలో అవసరాలపై నివేదిక అందజేస్తే సమకూర్చుతామని తెలిపారు. భవిత కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఈవో అబ్దుల్ ఘని, భవిత కేంద్రం నిర్వాహకులు యుగేందర్, ఎంఈవో మద్దిలేటి, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.