
వనపర్తి, వెలుగు : జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 1,36,958 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నాళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కల తీరనుంది. ఇందిరమ్మ ఇంటి పథకానికి ఎంపికైన లబ్దిదారులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 అని మూడు కేటగిరీలుగా విభజించారు. సొంతంగా ఇంటి స్థలం ఉన్న వారు మొదటి కేటగిరీగా, ఇంటి స్థలం లేని వారు రెండో కేటగిరీగా, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడో కేటగిరీగా విభజించి పథకాన్ని అమలు చేయనున్నారు.
ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు మాడల్‌ను నిర్మిస్తున్నారు. 400 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించుకుంటే ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారికి పునాది, గోడలు, సెంట్రింగ్ నిర్మాణ సమయాల్లో విడతలవారీగా రూ.5లక్షలు చెల్లిస్తుంది.
సొంత స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలాన్ని చూసి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వనుంది గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. కొన్ని ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎల్-2 లబ్దిదారులకు మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని, ఇవ్వడం ద్వారా ఇందిరమ్మ ఇంటి పథకంలో కొంత భారం తగ్గించుకోగలుగుతామని భావిస్తోంది.
ముందు ఈ రెండు కేటగిరీలు పూర్తయ్యాక మూడో కేటగిరీ కింద దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుల ఎంపికలో అక్రమాలకు తావివ్వరాదని, అర్హులైన వారినే గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించిన వివషయం తెలిసిందే. పలుచోట్ల గ్రామ సభల్లో ఇప్పటికే అర్హుల పేర్లను వినిపించారు. నిజంగా అర్హులుండి పేర్లు రానివారున్నా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
స్పష్టం చేశారు.
జిల్లాలో కేటగిరీల లబ్దిదారులు
ఎల్-1 కేటగిరీ అర్హులు 39,502
ఎల్-2 కేటగిరీ అర్హులు 17,752
ఎల్-3 కేటగిరీ దరఖాస్తులు 79,704
మొత్తం లబ్దిదారులు 1,36,958