ఏసీబీకి చిక్కిన పెబ్బేరు మున్సిపల్​ కమిషనర్​

ఏసీబీకి చిక్కిన పెబ్బేరు మున్సిపల్​ కమిషనర్​
  • రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్​ కమిషనర్​ ఆదిశేషు ఏబీబీ అధికారులకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్​ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా మహబూబ్​నగర్​ ఏసీబీ అడిషనల్​ ఎస్పీ శ్రీకృష్ణ గౌడ్​ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేండ్లుగా పని చేస్తున్న పట్టణానికి చెందిన ఓ మున్సిపల్​ కాంట్రాక్టర్​ 2023లో పెబ్బేరులోని 2, 3, 7, 10 వార్డుల్లో పేయింటింగ్​, సీసీ రోడ్లకు సంబంధించిన పనులు చేశాడు. 

అందులో ఒక్కో దానికి రూ.83,585 చొప్పున 3 పనులకు రూ.2,50,755 బిల్లు రావల్సి ఉంది. బిల్లులు మంజూరు చేసేందుకు మున్సిపల్​ కమిషనర్​ ఆదిశేషు రూ.25 వేలు డిమాండ్​ చేయగా, రూ.20 వేలకు డీల్​ కుదుర్చుకున్నారు. ఆ తరువాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం మున్సిపల్​ కమిషనర్​కు డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అలాగే హైదరాబాద్​లోని కమిషనర్​ ఇంట్లోనూ సోదాలు చేశారు. నాంపల్లి ఏసీబీ స్సెషల్​ కోర్టులో బుధవారం హాజరు పరుస్తామని​ఏసీపీ తెలిపారు.