
- రూ. వెయ్యి కట్టిన దరఖాస్తుదారులకే అమలు
- జిల్లాలో 48 వేల దరఖాస్తులకు మోక్షమెప్పుడో
వనపర్తి, వెలుగు: ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 48 వేల ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. మరో 14 రోజుల్లో ఎల్ఆర్ఎస్ గడువు ముగియనుండడంతో ఆ లోగా క్రమబద్దీకరణ పూర్తవుతుందా లేదా అనేది అనుమానంగా
మారింది.
తొలగని సందిగ్దం
ఎల్ఆర్ఎస్‌పై దరఖాస్తుదారులకు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటిని నివృతి చేయడంలో మున్సిపల్ ఆఫీసర్లు తలమునకలవుతున్నారు. 2020, అక్టోబర్‌లో స్థలాల రెగ్యులరైజేషన్ కోసం అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ముందు రూ. వెయ్యి కట్టి మీ సేవా కేంద్రాల్లో ప్లాట్ల నంబర్లపై ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తర్వాత క్రమబద్ధీకరణకు ఒక తేదీని ఇస్తామని చెప్పి దాదాపు నాలుగున్నరేళ్ల సమయాన్ని వృథా చేశారు. తాజాగా ఎల్ఆర్ఎస్‌కు అనుమతించడంతో పాటు ఈ నెలాఖరులోగా క్రమబద్ధీకరణ చేసుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు.
దరఖాస్తులు వేలు, ఎల్ఆర్ఎస్ అయినవి వందలు
జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలలో కలిపి ఎల్ఆర్ఎస్ కోసం 48 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్క జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీలోనే 29 వేల దరఖాస్తులు వచ్చాయి. అయినా ఇప్పటివరకు నాలుగైదు వందలకు మించి రెగ్యులరైజేషన్ కాకపోవడం గమనార్హం. రూ. వెయ్యి కట్టి ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్న వారికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి సమాచారం ఉండడం లేదు.
మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి కనుక్కుంటే ఇంకా కొంత సమయం పడుతుందని ఆఫీసర్లు చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక దరఖాస్తుదారులు వెనుదిరుగుతున్నారు. అయితే రూ.వెయ్యి కట్టి దరఖాస్తు చేసుకున్నవారికే ఎల్ఆర్ఎస్ చేస్తున్నామని మిగతా వారి విషయం ఇంకా కొలిక్కి రాలేదని అధికారులే పేర్కొంటున్నారు.
వెంచర్లది మరో గోస
ఇదిలా ఉండగా 2020 కంటే ముందు వెంచర్లు వేసి ఎల్ఆర్ఎస్ కోసం రూ.10 వేలు చెల్లించిన వారి ప్లాట్లనే రిజిస్ర్టేషన్ చేస్తున్నారు. కొన్ని ప్లాట్లకు కట్టి మిగతా వాటికి కట్టనివి చేయడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 200 దాకా వెంచర్లుండగా ఎల్ఆర్ఎస్ ప్రకటించిననాటి నుంచి ఇప్పటి వరకు 50 కూడా రిజిస్ర్టేషన్ కాకపోవడం
గమనార్హం.
జిల్లాలో మున్సిపాలిటీ వారీగా దరఖాస్తుల వివరాలు
వనపర్తి జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ కోసం ఛార్జీలు చెల్లించి ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఈ నెలాఖరులోగా క్లియర్ కావాల్సి ఉంది.
ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం
ఎల్ఆర్ఎస్‌పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. రోజూ 5 వేల మందికి ఫోన్ కాల్ చేస్తున్నాం. రూ. వెయ్యి కట్టి ఎల్1 కింద పెండింగ్ ఉన్నవారివీ త్వరలోనే క్రమబద్ధీకరిస్తాం. - వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వనపర్తి