
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: జిల్లాలో 2024-–25 వానాకాలం సీజన్‌కు సంబంధించి 50 శాతం సీఎంఆర్ సేకరించామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రాష్ట్ర సివిల్‌సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లతో వరి ధాన్యం కొనుగోలు, రేషన్ షాపుల్లో సన్న రకం బియ్యం పంపిణీపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ఎఫ్‌సీఐకి సకాలంలో అప్పగించాలన్నారు. అలా కాకుండా అమ్ముకుంటే పీడీయాక్ట్ పెట్టాలని కలెక్టర్లకు సూచించారు.
సన్న బియ్యం పంపిణీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2023–24 సీజన్ కు సంబంధించి మిల్లర్ల నుంచి 72 శాతం సీఎంఆర్ సేకరించి, ఎఫ్‌సీఐ కి అప్పగించామని తెలిపారు. బియ్యం ఇవ్వని మిల్లులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 19 మిల్లులతో అగ్రిమెంట్ చేసుకున్నామని అన్నారు.
జూరాల ప్రాజెక్టు లో నీటి నిల్వలు తగ్గిపోయినందున తాగునీటికి తప్ప వ్యవసాయ అవసరాలకు నీటిని విడుదల చేయలేమన్నారు. కర్నాటక రాష్ట్రంతో మాట్లాడి, జూరాలకు కొంత నీటి విడుదల జరిగేలా చూడాలని మంత్రిని కోరారు. అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, డీఎస్వో విశ్వనాథ్, ఇరిగేషన్ అధికారులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.