
- వనపర్తి జిల్లాలో గడువు దాటినా రైతులకు అందని స్పింక్లర్లు
- 3,200 యూనిట్లకు ఇచ్చింది 409 యూనిట్లే
- నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు
వనపర్తి, వెలుగు: సబ్సిడీ స్పింక్లర్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు యూనిట్లు మంజూరు చేసింది. అయితే గడువు దాటిపోయినా ఇప్పటి వరకు అర్హుల లిస్టును ఫైనల్ చేయలేదు. దీంతో ఈ యూనిట్లు ల్యాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ పడిపోతున్న తరుణంలో స్పింక్లర్ల ద్వారా నీటిని పొదుపుగా వాడుతూ పంటలను కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్న రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
పెండింగ్లో 2,800 యూనిట్లు..
వనపర్తి జిల్లాలో అత్యధిక మంది రైతులు పల్లి పంటను సాగు చేస్తారు. ఇక్కడి నేలల స్వభావం ఈ పంటకు అనుకూలం కావడంతో దాదాపు ప్రతి సీజన్లో 30 శాతం మంది రైతులు ఈ పంటను సాగు చేస్తారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. అయితే ఈ పంటలకు నీరు పెట్టుకోవడానికి స్పింక్లర్లు చాలా అవసరం. దీంతో రైతులు కొద్ది రోజులుగా సబ్సిడీ స్పింక్లర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్తో పాటు స్పింక్లర్ల యూనిట్లను పెద్ద మొత్తంలో మంజూరు చేసింది.
ఈ క్రమంలో స్పింక్లర్లను ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మంజూరు చేయగా.. వనపర్తి జిల్లాలో 3,200 యూనిట్లకు మంజూరు లభించింది. జిల్లాలోని రూరల్ మండలం, పెబ్బేరు, శ్రీరంగాపురం, గోపాల్పేట, ఖిల్లాగణపురం, పెద్దమందడి, రేవల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్, దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం, మక్తల్ నియోజకవరన్గంలోని ఆత్మకూరు, అమరచింత మండలాల రైతులకు ఈ యూనిట్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఈ యూనిట్ల కోసం నిరుడు మార్చి నుంచి ఈ నెల 15 వరకు 6,500 మంది రైతులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ, ఇప్పటివరకు 409 యూనిట్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన 2,800 యూనిట్లు పెండింగ్లోనే ఉండిపోయాయి.
అర్హుల లిస్టు ఓకే చేయకపోవడంతోనే..
వనపర్తి జిల్లాలో కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు ఉన్నాయి. అయితే కొందరు పొలిటికల్ లీడర్లు మంజూరైన స్పింక్లర్ల యూనిట్లను పంచుకున్నారు. ఇద్దరు ప్రధాన లీడర్లు వెయ్యి చొప్పున, ఓ మాజీ జడ్పీటీసీ 600, మరో సీనియర్ పొలిటీషియన్ 500 యూనిట్లను తమ వాటా కింద తీసుకున్నారు. మంజూరైన యూనిట్ల కోసం 6,500 మంది అప్లికేషన్లు పెట్టుకోగా.. ప్రాంతాల వారీగా లీడర్లు అప్లికేషన్లు పెట్టుకున్న వారిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. ఎంపిక చేసిన లిస్టును ఆఫీసర్లకు అందజేయాలి. కానీ, ఎవరూ ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ నెల 15వ తేదీతోనే సబ్సిడీపై పంపిణి చేయాల్సిన గడువు ముగియగా.. అర్హుల లిస్టు ఇవ్వకపోవడంతో యూనిట్లు పెండింగ్లో పడ్డాయి. అయితే 500 యూనిట్లను తీసుకున్న లీడర్ వద్దకు వెళ్లిన ఆఫీసర్లు.. లిస్టు గురించి అడగగా అర్హత ఉన్న 250 మందికి యూనిట్లు ఇవ్వాలని చెప్పడంతో.. ఆఫీసర్లు ఆ 250 యూనిట్లను పంపిణీ చేసి మిగతావి లిస్ట్ లేకపోవడంతో పెండింగ్లోనే పెట్టారు.
ల్యాప్స్ అయ్యే అవకాశం..
ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో ఆయా యూనిట్లు మంజూరవుతాయి. వీటి గ్రౌండింగ్ పూర్తి చేసి ఇయర్ ఎండింగ్లోపు అర్హులకు అందించాలి. అయితే గత ఫైనాన్షియల్ ఇయర్లో మంజూరైన 3,200 యూనిట్లకు ఈ నెల 15వ తేదీతో టైం అయిపోయింది. దీంతో ఈ యూనిట్లు ల్యాప్స్ అవుతాయా? మళ్లీ కొత్త యూనిట్లు మంజూరు చేస్తారా? ఒక వేళ కొత్త యూనిట్లు మంజూరు చేస్తే.. మళ్లీ కొత్తగా యూనిట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.