వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ కు రాజీనామా లెటర్లను అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలని నోటీసు ఇవ్వడంతో, ఈ నెల 27న సమావేశాన్ని నిర్వహించనున్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కౌన్సిలర్లను సముదాయించి వారితో రాజీనామా చేపిస్తానని చెబుతూ వచ్చారు.
ఈ నెల19న రాజీనామా చేస్తారని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరానికి రావాలని వారికి సూచించారు. అయితే రాజీనామా చేసి, ఆమోదం పొందాక శిబిరానికి వస్తామని అసంతృప్త కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో నాటకీయ పరిణామాల నడుమ రిజైన్ లెటర్లు అందజేశారు. 14 మంది కౌన్సిలర్లు ఒక కౌన్సిలర్ శిబిరంలో ఉండగా, ఏడుగురు మాజీ మంత్రి ఇంటి వద్ద ఉన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లురాజీనామా చేస్తున్నారని, కౌన్సిలర్లను పిలిపించారు.
అసంతృప్త కౌన్సిలర్లలో కొందరు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఎందుకున్నారంటూ మాజీ మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొత్త చైర్మన్‌గా అసంతృప్త కౌన్సిలర్లు సూచించిన వ్యక్తిని మాజీ మంత్రి వద్దన్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే హైకమాండ్ నిర్ణయం మేరకు తమ పదవులకు రాజీనామా చేసినట్లు చైర్మన్, వైస్ చైర్మన్లు తెలిపారు.