వనపర్తి : రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లపై కౌన్సిలర్ల తిరుగుబాటు కంటిన్యూ అవుతోంది. తాజాగా వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్పై 22 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు ప్రకటించారు. వారిపై అవిశ్వాసం పెట్టి పదవుల నుంచి దించేస్తామని హెచ్చరించారు. బుధవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సమావేశమైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన 22 మంది కౌన్సిలర్లు ఈ మేరకు తమ నిర్ణయం ప్రకటించారు.
వనపర్తి పట్టణానికి దాదాపు 3కిలోమీటర్ల దూరంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిర్మించడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అంత దూరంలో బిల్డింగ్ నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నిర్మాణం విషయంలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.