నగల కోసమే వ్యాపారి హత్య..కేసును ఛేదించిన వనపర్తి పోలీసులు

నగల కోసమే వ్యాపారి హత్య..కేసును ఛేదించిన వనపర్తి పోలీసులు
  • గత నెల 21న జరిగిన హత్య కేసును ఛేదించిన వనపర్తి పోలీసులు
  • నలుగురు అరెస్ట్‌‌‌‌, రూ.70 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, నగదు స్వాధీనం

 వనపర్తి, వెలుగు : గత నెల 21న జరిగిన బంగారు నగల వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కోసమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌‌‌‌ మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌‌‌‌కు చెందిన దీపక్‌‌‌‌ మాలి నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా బిజినేపల్లిలో ధనలక్ష్మి నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అవ్వారు శేషు బంగారు, వెండి ఆభరణాలను నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, బిజినేపల్లి పరిసర ప్రాంతాల్లోని షాపులకు సరఫరా చేసేవాడు. 

ఈ క్రమంలో దీపక్‌‌‌‌కు, శేషుకు పరిచయం ఏర్పడింది. దీపక్‌‌‌‌కు వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులపాలయ్యాడు. దీంతో శేషును హత్య చేసి అతడి వద్ద ఉన్న బంగారం, వెండితో పాటు డబ్బులు కాజేయాలని ప్లాన్‌‌‌‌ చేశాడు. ఇందులో భాగంగా రాజస్తాన్‌‌‌‌లోని చండావల్‌‌‌‌లో ఉంటున్న తన తమ్ముడు రమేశ్‌‌‌‌ మాలికి ఫోన్‌‌‌‌ చేసి విషయం చెప్పాడు. అతడు అదే గ్రామానికి చెందిన ముఖేశ్‌‌‌‌ మేఘ్వాల్‌‌‌‌, హిరవాస్‌‌‌‌ గ్రామానికి చెందిన జగదీశ్‌‌‌‌ భార్వాడ్‌‌‌‌తో కలిసి నవంబరు 21న జడ్చర్లకు వచ్చారు. దీపక్‌‌‌‌ వారిని రిసీవ్‌‌‌‌ చేసుకొని మంగనూరు వద్ద దింపిన అనంతరం బిజినేపల్లిలోని తన షాప్‌‌‌‌కు వచ్చాడు. 

అదే రోజు శేషు డబ్బుల కోసం దీపక్‌‌‌‌ షాప్‌‌‌‌కు వచ్చాడు. దీపక్‌‌‌‌ నుంచి రూ. 6.50 లక్షలను తీసుకొని మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ వెళ్తున్నానని చెప్పాడు. దీంతో దీపక్‌‌‌‌.. తాను కూడా అక్కడికే వెళ్తున్నానని, తన కారులో వెళ్దామంటూ తీసుకెళ్లాడు. మార్గమధ్యలో  రమేశ్‌‌‌‌, ముఖేశ్‌‌‌‌, జగదీశ్‌‌‌‌ను ఎక్కించుకున్నాడు. తర్వాత వారు శేషును తీవ్రంగా కొట్టడంతో అతడు స్పృహ తప్పాడు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలగొండ సమీపానికి రాగానే శేషుకు మెలకువ రావడంతో టవల్‌‌‌‌తో నోరు, ముక్కు మూసేసి హత్య చేశారు. 

అతడి వద్ద ఉన్న 78 తులాల బంగారు, 7.177 కిలోల వెండి, రూ. 6.50 లక్షలను తీసుకొని సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ వాగులో, బ్యాగ్‌‌‌‌ను గోపాల్‌‌‌‌పేట మండలం బుద్దారంగండి చెరువులో విసిరేసి, శేషు డెడ్‌‌‌‌బాడీని రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడేశారు. రెండు రోజులైనా శేషు ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు 23న బిజినేపల్లికి వచ్చి దీపక్‌‌‌‌ను కలువగా తన వద్ద డబ్బులు తీసుకొని అప్పుడే వెళ్లిపోయాడని చెప్పాడు. అనుమానం వచ్చిన శేషు బంధువులు బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే గుర్తుతెలియని శవం దొరికిందంటూ సోషల్‌‌‌‌ మీడియాలో వచ్చిన ఫొటోను చూసి శేషుగా గుర్తించారు. 

దీంతో పోలీసులు దీపక్‌‌‌‌ను అదుపులోకి విచారించగా తన తమ్ముడు, మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు పంపినట్లు ఎస్పీ గిరిధర్‌‌‌‌ తెలిపారు. నిందితులను పట్టుకున్న వనపర్తి సీఐ కృష్ణ, సీసీఎస్ సీఐ రవిపాల్, స్పెషల్‌‌‌‌ బ్రాంచ్ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ నరేశ్‌‌‌‌, సీసీఎస్‌‌‌‌ ఎస్సైలు రామరాజు, వేణు, తిరుపతిరెడ్డి, గోపాల్‌‌‌‌పేట ఎస్సై నరేస్‌‌‌‌, వనపర్తి పట్టణ ఎస్సై హరిప్రసాద్‌‌‌‌ను ఎస్పీ అభినందించారు.