T20 World Cup 2024: వరల్డ్ కప్‌లో ఫ్లాప్ షో.. శ్రీలంక కెప్టెన్సీకి హసరంగా రాజీనామా

T20 World Cup 2024: వరల్డ్ కప్‌లో ఫ్లాప్ షో.. శ్రీలంక కెప్టెన్సీకి హసరంగా రాజీనామా

శ్రీలంక టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం (జూలై 11) అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఒక ఆటగాడిగా శ్రీలంక తరపున ఎప్పుడూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా జట్టు కెప్టెన్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటాను". అని SLC అధికారిక ప్రకటనలో హసరంగా తెలిపారు.

26 ఏళ్ల ఈ  స్పిన్ ఆల్‌రౌండర్ 2024 ఫిబ్రవరిలో శ్రీలంక టీ20 జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. విఫలమవుతున్న శనక స్థానంలో అతనికి శ్రీలంక క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. హసరంగా కేవలం 10 మ్యాచ్ లకు మాత్రమే కెప్టెన్ గా చేశాడు. వీటిలో శ్రీలంక 6 మ్యాచ్ ల్లో గెలిచి మరో నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కెప్టెన్ అయిన కేవలం 5 నెలలకే హసరంగా రాజీనామా చేయడం ఆశ్చర్యకరంగా మారింది. భారత్ తో ఈ నెలాఖరులో టీ20 సిరీస్ కు కుశాల్ మెండిస్ కెప్టెన్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. 

వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక కనీసం సూపర్-8 కు చేరలేకపోయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లపై ఓడిపోయి గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో శ్రీలంక జట్టుపై ఆ దేశంలో విమర్శల వర్షం కురుస్తుంది. ఈ కారణంగానే హసరంగా తన కెప్టెన్సీకి రాజీనామా చేసినట్టు వార్తలొస్తున్నాయి.