మరో పది రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా ఒక్కొక్క స్టార్ ప్లేయర్ ఈ మెగా టోర్నీకి దూరం అవుతున్నారు. తాజాగా శ్రీలంక స్టార్ ప్లేయర్ వానిందు హసరంగా వరల్డ్ కప్ కి దాదాపుగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హసరంగా హార్మ్ స్ట్రింగ్ గాయం కారణంగా ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. కాగా.. శ్రీలంక జట్టు ఇంకా వరల్డ్ కప్ స్క్వాడ్ ని ఇంకా ప్రకటించలేదు. ఆ జట్టు సెప్టెంబర్ 28లోపు తుది ప్రపంచ కప్ స్క్వాడ్‌లను ప్రకటించాల్సి ఉన్నందున హసరంగా ఈ నాలుగు రోజుల్లో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.
హసరంగా లాంటి స్పిన్నర్ లేకపోవడం శ్రీలంకకు బిగ్ షాక్ అని చెప్పాలి. గత కొంతకాలంగా శ్రీలంక జట్టు విజయాల్లో ఈ స్టార్ స్పిన్నర్ ఎంత కీలక పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల సమర్ధుడు.ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ లో అటు బౌలింగ్ లో టాప్ వికెట్ టేకర్ గా, ఇటు బ్యాటింగ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఈ టోర్నీ తర్వాత గాయపడిన హసరంగా..ఇప్పటివరకు కోలుకోలేదు.
ఈ క్రమంలో ఆసియా కప్ కి దూరమయ్యాడు. వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటాడని లంక ఆశాభావం వ్యక్తం చేసినా అనుకున్నది జరగలేదు. ఇక ఇప్పటికే పేస్ బౌలర్లు లాహిరు కుమార, చమీర, మధుశంక గాయాలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మరో స్పిన్నర్ ఆసియా కప్ లో తీక్షణ గాయపడిన వరల్డ్ కప్ కి అందుబాటులో ఉంటాడని సమాచారం.