
- దేశ రాజకీయాల్లో పెరిగిన డబ్బు ప్రభావం
- ఎన్నికల్లో వ్యక్తిత్వం కంటే బ్యాంకు బ్యాలెన్సే కీలకం
- ఖర్చులు పెరగడంతో అవినీతినీ పెంచిన కొందరు నేతలు
- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్టడీలో వెల్లడి
న్యూఢిల్లీ: మన దేశంలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ తదితర ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థుల వ్యక్తిత్వం కంటే వారి బ్యాంకు బ్యాలెన్సే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. పార్టీ టికెట్ సాధించడం, ప్రచారం చేయటం వంటి అనేక ప్రక్రియలో డబ్బు ఆధిపత్యమే కొనసాగుతున్నది. ఈ విషయాల్ని ‘భారతదేశంలో రాజకీయాల ఖర్చు’ అనే అంశంపై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్)చేసిన ఒక ఆసక్తికర అధ్యయనం వెల్లడించింది. దేశ రాజకీయాలను ధనవంతులే నియంత్రిస్తున్నారని ఈ స్టడీ చెప్పింది.
ప్రస్తుతం రాజకీయల్లోకి రావాలనుకునే వాళ్లు నెలకు రూ. 3 నుంచి 4 లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధమవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. రాజకీయ ఖర్చులు కేవలం ఎన్నికల సీజన్లకే పరిమితం అనేది అపోహ మాత్రమేనని తెలిపింది. ఎన్నో సంవత్సరాలపాటు ఖర్చులను తట్టుకుంటేనే పొలిటికల్ లీడర్లు తమ పేర్లను ఎన్నికల బ్యాలెట్‌లో చూస్తారని వివరించింది.
ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకోవడానికి నెలకు కనీసం రూ. 3 నుంచి -4 లక్షల వరకు అవసరమని స్టడీ పేర్కొంది. ఒక నాయకుడు పార్టీ టికెట్ పొందాలంటే పెండ్లిళ్లు, అంత్యక్రియలకు హాజరు కావడం, మతపరమైన వేడుకల్లో పాల్గొనడం, కార్యకర్తల నెట్‌వర్క్ నిర్వహించడం, ప్రజలకు ఆర్థిక సహాయం, కార్యకర్తలు, అనుచరుల అవసరాలు తీర్చడం వంటి వాటికి కోట్లు ఖర్చు చేయాలని తెలిపింది. డబ్బు లేని నేతలు భారత రాజకీయాల్లో నెగ్గడంలేదని స్టడీ పేర్కొంది.
నామినేషన్ తర్వాత మరిన్ని ఖర్చులు
ఎన్నికల్లో పార్టీ టికెట్ పై నామినేషన్ వచ్చాక అభ్యర్థులు మరిన్ని ఖర్చులు భరించాల్సిన పరిస్థితి నెలకొందని స్టడీ వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఒక అభ్యర్థి కనీసం రూ. 5 నుంచి-10 కోట్లు ఖర్చుచేస్తున్నారు. హై ప్రొఫైల్ అభ్యర్థులు పోటీగా ఉన్న నియోజకవర్గాలలో ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అభ్యర్థులు ప్రచారానికి రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలని తేలింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన మొత్తం ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లుగా అంచనా.
ఉనికిని కొనసాగించడానికి కూడా..
ఎన్నికల్లో గెలిచిన వారికి కూడా ఖర్చులు తప్పడం లేదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలో తమ ఉనికిని కొనసాగించడానికి, పార్టీ కార్యకలాపాలకు సొంతంగా ఖర్చులు పెడుతున్నారు. ఈ ఖర్చులు పెరగడంతో అవినీతికి పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రచార ఖర్చులను తిరిగి పొందడం, భవిష్యత్తు ఎన్నికల్లో గెలవడానికి నిధులను సేకరించడం కోసం పాలన బాధ్యతలను విస్మరిస్తున్నారు.