ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: నిర్మానుష్య ప్రాంతాలే అడ్డాలుగా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేయాలని సీపీ విష్ణు వారియర్ పోలీసు ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే చోరీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, ప్రతీ గ్రామంలో ప్రజలే స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ కేసుల విషయంలో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సమీక్షలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, అడిషనల్ డీసీపీ రామోజీ రమేశ్, ట్రైనీ ఏఎస్పీ అవినాష్ కుమార్, ఏసీపీలు గణేశ్, బస్వారెడ్డి, రహమాన్, రామానుజం, ప్రసన్న కుమార్, రవి, వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, జిల్లాలోని ప్రధాన విభాగాల పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.