Cricket World Cup 2023: మా పరువు తీస్తున్నారు..నన్ను పాకిస్థానీ అని పిలవొద్దు: వకార్ యూనిస్

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది. నెదర్లాండ్స్ , శ్రీలంక లాంటి బలహీనమైన జట్లపై వరుసగా రెండు విజయాలు సాధించిన పాక్.. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఇప్పుడు పాక్ పై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా పాక్ మాజీలు ఈ ఓటముల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆసీస్ పై ఓటమి అనంతరం నన్ను పాకిస్థానీ అని పిలవొద్దు పాక్ పేస్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ ఖాన్ తెలిపాడు. 

బెంగళూరు వేదికగా నిన్న (అక్టోబర్ 20) పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచులో ఆసీస్ 62 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం వకార్ తో పాటు ఇద్దరు మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు, షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్‌లతో కలిసి పోస్ట్-మ్యాచ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ దిగ్గజ బౌలర్..నేను ఆస్ట్రేలియాలో సగ భాగం. నన్ను పాకిస్థానీ అని పిలవొద్దు అని షాకింగ్ కామెంట్స్ చేసాడు. పాక్ క్రికెట్ సరిగ్గా ఆడకపోవడంతోనే వకార్ ఈ వ్యాఖ్యలు చేసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

వకార్ ఒక పాకిస్థానీ క్రికెటర్ కానీ అతడు ఒక ఆస్ట్రేలియన్ వైద్యురాలు ఫార్యాల్‌ను వివాహం చేసుకున్నాడు వీరి కుటుంబం న్యూ సౌత్ వేల్స్‌లోని క్యాజిల్ హిల్లే అనే ఆస్ట్రేలియా పట్టణంలో నివసిస్తుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఈ  దిగ్గజ పేసర్ 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో పాక్ తరపున 87 టెస్ట్ మ్యాచ్‌లు, 262 ODIలు ఆడాడు. టెస్టుల్లో 373, వన్డేల్లో 416 వికెట్లు తీసుకున్నాడు. 
 
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. వార్నర్ 164 పరుగులు,  మార్ష్ 121 పరుగులు చేశాడు. షాహీన్ అఫ్రిది ఐదు వికెట్లు పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనలో అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్ తొలి వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ప్రభావం చూపించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.