వక్ఫ్ చట్ట సవరణతో ఎవరికీ నష్టం లేదు : మల్క కొమురయ్య

వక్ఫ్ చట్ట సవరణతో ఎవరికీ నష్టం లేదు :  మల్క కొమురయ్య
  • టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

సిద్దిపేట రూరల్, వెలుగు: పేద ముస్లింల ఇన్​కమ్ పెంచడానికే  కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చిందని, దీనివల్ల ఎవరికీ నష్టం లేదని  టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన వక్ఫ్ చట్ట సవరణ జన జాగరణ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. 

వక్ఫ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని బడా ముస్లిం నాయకులు పేద ముస్లింలకు అన్యాయం చేస్తూ, భూములను కబ్జా చేసి వాటి ప్రతిఫలాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ ఖాళీ భూమి కనబడ్డా దానికి వక్ఫ్ బోర్డు తగిలించి ఆ భూములను కబ్జా చేసి ఎంతోమందిని ఇబ్బందిపెట్టారన్నారు. ఈ చట్టం గురించి తెలియని పేద రైతులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ ఆధీనంలో ఉన్న భూముల నుంచి వచ్చే ఇన్​కమ్​పేద ముస్లింలందరికీ దక్కుతుందని తెలిపారు. 

వక్ఫ్ ఆధీనంలో ఉన్న భూములు మిస్ యూస్ కాకుండా కాపాడుతుందన్నారు. కొంతమంది ముస్లిం లీడర్లు, ప్రతిపక్షాలు పేద ముస్లింలను కావాలని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు  2003 డీఎస్సీ అభ్యర్థులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్, రామచంద్రారెడ్డి, విద్యాసాగర్, కనకయ్య, నరేశ్, శ్రీనివాస్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ముబిన్, బాసం గారి వెంకట్ పాల్గొన్నారు.