
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం, 2025 అమలులోకి వచ్చింది. ఇటీవల పార్లమెంట్ ఉభయసభలు పాస్ చేసిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. మంగళవారం ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, దీంతో ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. కాగా, వక్ఫ్(సవరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల16న విచారణ చేపట్టనున్నది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని ఇందులో కోరింది. ఈ వివాదాస్పద చట్టంపై ఇప్పటివరకు15 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు, ముస్లిం వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సవరించిన చట్టంలోని వివాదాస్పద నిబంధనల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేర్చడాన్ని తప్పుపడుతున్నాయి. అలాగే, కనీసం ఐదేండ్లు ఇస్లాంను ఆచరించిన వ్యక్తులు మాత్రమే వక్ఫ్‌కు ఆస్తులను విరాళంగా ఇవ్వవచ్చనే నిబంధనపై కూడా అభ్యంతరం చెప్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని నిబంధనలను కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.