
వక్ఫ్ బోర్టు చట్టానికి వ్యతరేకంగా పశ్చిమ బెంగాల్ హింసాత్మకంగా మారింది. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు చెలరేగిపోయారు. ఇండ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్లు బ్లాక్ చేయడంతో ప్రయాణాలకు, రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనల్లో 10 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
ముర్షిదాబాద్‌లోని సుతిలో, నిరసనకారులు రూల్స్ ను ఉల్లంఘించి గుమిగూడి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఊరేగింపుల సమయంలో పోలీసు వ్యాన్లు, ప్రభుత్వ బస్సులను తగలబెట్టారు.దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. షంషేర్‌గంజ్‌లోని డక్‌బాంగ్లో మోర్ నుంచి సుతిర్ సజుర్ మోర్ వరకు నేషనల్ హైవే -12ను దిగ్బంధించడంతో సమస్య ప్రారంభమైంది ఆందోళనకారులు పోలీసు వ్యాన్‌పై రాళ్లు రువ్వడంతో నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది పోలీసులు గాయపడ్డారు అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ వాడాల్సి వచ్చిందని చెప్పారు.
జంగిపూర్‌లో అశాంతి జరిగినప్పటి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి, .ముర్షిదాబాద్, మాల్డా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో అల్లర్లకు కారణమైన దుండగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ : మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. అల్యూమినియం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 8 మంది మృతి
పార్లమెంటు ఉభయ సభలలో సుదీర్ఘ చర్చల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లును ఇటీవల లోక్‌సభ ,రాజ్యసభ ఆమోదించాయి. ఈ బిల్లు ముస్లింలపై వివక్షత అని ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ దీనిని రాజ్యాంగంపై బహిరంగ దాడి అని విమర్శించారు. కానీ బిజెపి ఈ బిల్లును సమర్థించింది, ఈ బిల్లు అవినీతిని తగ్గించడం, వక్ఫ్ ఆస్తులను మెరుగ్గా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.