వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. విపక్షాల సూచనలను లెక్కలోకే తీసుకోలేదు..!

వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. విపక్షాల సూచనలను లెక్కలోకే తీసుకోలేదు..!

ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ(JPC)ఎన్డీయే సభ్యులు సూచించిన అన్ని సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల సూచనలను తిరస్కరించింది. కమిటీ పలు కీలక ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాన్ని మరింత ప్రభావవంతంగా రూపొందించే దిశగా ముందుకెళ్లబోతోందని సమావేశం అనంతరం జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ చెప్పారు. 14 సవరణలకు కమిటీ ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. ఈ సవరణ బిల్లులో విపక్ష సభ్యులతో సహా ఇతర సభ్యులు మొత్తం 44 నిబంధనల్లో మార్పులుచేర్పులు సూచించారు.

ALSO READ | కుంభమేళా 2025: మౌని అమావాస్య ( జనవరి 29) న పుణ్య స్నానం ఎందుకు చేయాలి.. పురాణాల్లో ఏముంది..

విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. కమిటీ చైర్మన్ ఈ ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా చేయలేదని, ఒక నియంత తరహాలో కమిటీ చైర్మన్ జగదాంబిక పాల్ వ్యవహరించారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. అయితే.. ఈ విమర్శలపై కమిటీ చైర్మన్ వివరణ ఇచ్చారు. ఈ పరిశీలన ప్రక్రియ అంతా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగానే జరిగిందని.. మెజారిటీని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ముందుకెళ్లినట్లు చెప్పారు.

వక్ఫ్ బిల్లు, 2024లో సవరణలు ఏమిటి?
* 1995 నాటి వక్ఫ్‌‌ చట్టంలో సెక్షన్ 40ని తొలగించాలని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుదా..? కాదా? అని ఈ సెక్షన్ 40 నిర్ణయిస్తుంది. బోర్డుకు విస్తృత అధికారాన్ని ఈ సెక్షన్ కట్టబెట్టింది. 
* సింపుల్గా చెప్పాలంటే వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం.
* ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఈ బిల్లు సూచిస్తున్నది. దీంతో ఆస్తిని అసెస్​మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. 
* ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది.
* ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్తినా? లేక ప్రభుత్వ భూమినా? అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని, ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు. 
* కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు. 
* కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే దాకా ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు.
*  వక్ఫ్‌‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం రానున్నది.
* ఇందులో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేందుకు కేంద్రం ప్రతిపాదించింది.
* వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పించాలనేది ఈ బిల్లు లక్ష్యం.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. 
* వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు సూచిస్తుంది.