వక్ఫ్ బోర్డు బిల్లును.. లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు.. బిల్లు ఆమోదం పొందాలంటే..

వక్ఫ్ బోర్డు బిల్లును.. లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు.. బిల్లు ఆమోదం పొందాలంటే..

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్​ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్​సభ ముందుకు వచ్చింది. క్వశ్చన్ ​అవర్​ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును సభలో మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు ప్రవేశపెట్టారు. ఎనిమిది గంటల పాటు ఈ బిల్లుపై చర్చిస్తారు. అనంతరం సభ ఆమోదం కోసం స్పీకర్​ ఓటింగ్​నిర్వహించనున్నారు.

కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు వక్ఫ్ బోర్డు బిల్లు-2025ను పార్లమెంటులో  ప్రవేశపెట్టారు. వక్ఫ్ చట్టం-1995 కు సవరణలతో కూడిన బిల్లులను బుధవారం (ఏప్రిల్ 2) పార్లమెంటులో ప్రవేశపెటారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణలో ఉన్న సమస్యలు, వాటి సవరణలు సూచిస్తూ  కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది.

2024 ఆగస్టులోనే బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి రిజుజు.. ఆ తర్వాత జేపీసీ సమీక్షకు పంపారు. ఫిబ్రవరి 27న జేపీసీ 14 సవరణలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇవాళ బిల్లును పార్లమెంటులో రెండవసారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వక్ఫ్ బిల్లు ఎందుకు తీసుకురావాల్సిందో వివరిస్తూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

వక్ఫ్ బోర్డు బిల్లుపై కిరెణ్​ రిజుజు ఏమన్నారంటే..
* వక్ఫ్ బోర్డులో ఇద్దరు మహిళలు ఉంటారు
* ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండదు
* మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు
* బిల్లును వ్యతిరేకిస్తున్నవారు ఇది తెలుసుకోవాలి
* ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది 
* భారతీయ రైల్వే దగ్గర అత్యధిక ల్యాండ్ ఉంది.. అది భారతీయులు ఉపయోగించుకుంటున్నారు
* రెండో స్థానం రక్షణ శాఖ  దగ్గర ఉంది
* మూడో అత్యధిక ల్యాండ్ వక్ఫ్ దగ్గర ఉంది
* అది భారతీయులు వినియోగించుకోలేదు

వక్ఫ్​ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్నది. లోక్​సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 272 మంది సభ్యుల సాధారణ మెజార్టీ అవసరం. బీజేపీకి సొంతగా 240 మంది సభ్యులు ఉన్నారు. దాని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ వంటి పలు పార్టీల బలంతో కలిపి 293గా ఉంది. సభకు తప్పకుండా హాజరుకావాలని, ఓటింగ్లో పాల్గొనాలని పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. 

ALSO READ | రేవంత్ పట్టుదల వల్లే కులగణన సక్సెస్.. అన్ని రాష్ట్రాలు కలిసి వస్తేనే మోదీ జంకుతాడు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్

మిత్రపక్షాల మద్దతు బీజేపీకి లభిస్తే వక్ఫ్​ బిల్లు లోక్​సభలో గట్టెక్కుతుంది. ప్రతిపక్షాలు మాత్రం బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. లోక్​సభలో ఆమోదం అనంతరం రాజ్యసభకు ఈ బిల్లు వెళ్లనుంది. అక్కడ కూడా చర్చించి ఆమోదం పొందాకే చట్టరూపం దాలుస్తుంది.