వక్ఫ్ సవరణ​ బిల్లు నివేదికపై రాజ్యసభలో రచ్చ..నిరసనల మధ్యే ఆమోదం

వక్ఫ్ సవరణ​ బిల్లు నివేదికపై  రాజ్యసభలో రచ్చ..నిరసనల మధ్యే ఆమోదం
  • సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి
  • తమ అసమ్మతి నోట్ తొలగించారని ప్రతిపక్షాల ఆందోళన
  • జేపీసీ రిపోర్టుపై చర్చ కోసం వెనక్కి పంపాలని డిమాండ్​
  • పెద్ద ఎత్తున నినాదాలు.. నిరసనల మధ్యే నివేదికకు ఆమోదం

న్యూఢిల్లీ: రాజ్యసభలో వక్ఫ్​ సవరణ బిల్లు నివేదికపై రభస నెలకొన్నది. జాయింట్​ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్రం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జేపీసీకి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన జగదంబికా పాల్‌‌‌‌‌‌‌‌, బీజేపీ ఎంపీ సంజయ్‌‌‌‌‌‌‌‌ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ నివేదికను సభ ప్రారంభం కాగానే బీజేపీ ఎంపీ మేధా విశ్రం కులకర్ణి ప్రవేశపెట్టారు. అయితే, ఇందులో తమ అసమ్మతి నోట్​ను తొలగించారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసనకు దిగారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్‌‌‌‌‌‌‌‌ జగదీప్‌‌‌‌‌‌‌‌ ధన్‌‌‌‌‌‌‌‌ఖర్‌‌‌‌‌‌‌‌  20 నిమిషాల పాటు వాయిదా వేశారు.

 అనంతరం సభ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయినప్పటికీ ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. వక్ఫ్ బిల్లుపై  జేపీసీ రూపొందించిన నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో అపొజిషన్​ లీడర్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని చైర్మన్​ ధన్​ఖడ్​​ను కోరారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ  అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదన్నారు.  దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాగా, తాము ఎలాంటి అసమ్మతి నోట్​ను తొలగించలేదని కేంద్రం తెలిపింది. అయితే, అభ్యంతరాలు కలిగించే విభాగాలను తొలగించే విచక్షణ ప్యానెల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌కు ఉందని నొక్కి చెప్పింది. కాగా, విపక్షాల నిరసనల మధ్యే వక్ఫ్​ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతున్నది. 

వృద్ధిని ప్రోత్సహించడమే బడ్జెట్​ లక్ష్యం

వృద్ధిని ప్రోత్సహించడం, సమ్మళిత అభివృద్ధిని కొనసాగించడం, పెట్టుబడులను పెంచడమే కేంద్ర బడ్జెట్​ 2025–26 లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ​పేర్కొన్నారు. రాజ్యసభలో జనరల్​ బడ్జెట్​పై​ డిస్కషన్​ సందర్భంగా ఆమె సమాధానం ఇచ్చారు. అనేక సవాళ్లతో కూడిన సమయంలో ఈ బడ్జెట్​ను రూపొందించామని చెప్పారు. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ కచ్చితమైన అంచనాలతో, సాధ్యమైన రీతిలో బడ్జెట్​ రూపకల్పనకు ప్రయత్నించామని తెలిపారు. బడ్జెట్​లో రంగాలవారీగా కేటాయింపులు తగ్గించలేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 19.08 లక్షల కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. నేషనల్​ స్టాటిస్టిక్స్​ ఆఫీస్(ఎన్​ఎస్​వో) ప్రకారం దేశ వృద్ధి రేటు రియల్​ టర్మ్స్​లో 6.4 శాతం అని, అయితే, నామినల్​ టర్మ్స్​లో ఇది 9.7 శాతం ఉంటుందని అంచనా వేశారు.  కరోనా ​సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బాగా నడిపించిందని, ఫలితంగా దేశంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ అవతరించిందని తెలిపారు.

లోక్​సభలో కొత్త ఇన్​కం ట్యాక్స్​ బిల్లు

గురువారం కేంద్ర సర్కారు కొత్త ఇన్​కం ట్యాక్స్​ బిల్లును లోక్​సభ ముందుకు తీసుకొచ్చింది. ప్రతిపక్షాల నిరసన మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో అపోజిషన్​ ఎంపీలు సభ నుంచి వాకౌట్​ చేశారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రక్షాళ చేసి, సులభతరంగా కొత్త బిల్లును రూపొందించారు. ఇందులో కొత్తగా ‘అసెస్​మెంట్​ ఇయర్’​ స్థానంలో ‘ట్యాక్స్​ ఇయర్’​ అనే పదం వాడారు. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది.

ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్​లో బడ్జెట్​సమావేశాల తొలి సెషన్ ముగిసింది. గురువారం ఉభయ సభలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​పై ఎంపీల ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. అనంతరం లోక్ సభలో ఇన్ కం టాక్స్ 2025 బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను వచ్చే నెల 10 ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్​ మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.