
న్యూఢిల్లీ: పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని అన్నారు. అట్టడుగు వర్గాలకు ఈ బిల్లుతో మేలు జరుగుతుందని, వారి గళం వినిపించే అవకాశం దొరుకుతుందని చెప్పారు. దేశ సామాజిక ఆర్థిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధనలో వక్ఫ్ బిల్లు కీలకమైన మలుపు అని పేర్కొన్నారు.
ఇలాంటి చట్టాలు చేసేందుకు సహకరించిన పార్లమెంటు సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీ.. వక్ఫ్ బిల్లు పార్లమెంటులో పాసైన సందర్భంగా శుక్రవారం ట్వీట్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శక, జవాబుదారీతనం లోపించిందని, దాంతో పేద ముస్లింలు, ముస్లిం మహిళలకు తీవ్ర నష్టాన్ని కలిగిందని అన్నారు.
తాజాగా సవరణ బిల్లు ఆమోదంతో వాళ్ల హక్కులకు భద్రత లభించినట్లయిందని అన్నారు. ఇప్పటి నుంచి సామాజిక న్యాయం జరిగే ఆధునిక విధానంలోకి మనం ప్రవేశిస్తున్నామని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.