హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగానికి, సెక్యులర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీని సవరణ బిల్లు పాస్ అవుతుందని తెలిపారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ముస్లింల ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్ని కూడా అమ్మేస్తాయని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని, ఎవరైనా సరే కోర్టు తీర్పును వినాల్సిందేనన్నారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారాలిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 ఏండ్ల కింద ఔరంగజేబు నోటిమాటతో భూములిచ్చిండొచ్చని, కానీ నేడు పట్టా డాక్యుమెంట్స్ ఉన్న భూములు కూడా తమవేనని అనడంపై ఆయన మండిపడ్డారు. అసలు వక్ఫ్ అనేది ఖురాన్లో లేదన్నారు. వక్ఫ్ అనేది మతం కిందకు రాదని ప్రపంచంలో అన్ని దేశాలు చెబుతున్నాయని గుర్తుచేశారు.
దేవాలయం అనేది మతానికి సంబంధించిందని, వక్ఫ్ అనేది సమాజానికి సంబంధించిన అంశమని తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఒక బొమ్మ మాత్రమేనని, నాడు మన్మోహన్ సింగ్ను ఎలా వాడుకున్నారో ఖర్గేను కూడా అలాగే వాడుకుంటున్నారన్నారు. వక్ఫ్ బోర్డు పేరిట గుట్టల బేగంపేటలో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు మద్దతుగా గుర్రంపై, తల్వార్ తో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వచ్చారు.