వక్ఫ్​ అమలుచేయాల్సిందే.. రాష్ట్ర ప్రభుత్వాలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

వక్ఫ్​ అమలుచేయాల్సిందే.. రాష్ట్ర ప్రభుత్వాలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

కొచ్చి(కేరళ): వక్ఫ్​ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమనే అధికారం ఏ రాష్ట్రానికీ లేదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​రిజిజు స్పష్టం చేశారు. పాత తప్పులను కరెక్ట్​చేసేందుకే వక్ఫ్​సవరణ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ముస్లింలను ఎక్కడా టార్గెట్​చేయలేదని, పేద ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకే సవరణ చేశామని  క్లారిటీ ఇచ్చారు. 

మంగళవారం కేరళలోని కొచ్చిలో కిరణ్​ రిజిజు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎవరూ మరొక వ్యక్తి ఆస్తులను బలవంతంగా, ఏకపక్షంగా స్వాధీనం చేసుకోలేరని చాటడమే కేంద్రం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తుందని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, అక్రమ ఆక్రమణలను నిరోధించడంతో పాటు ఈ ఆస్తులను సమాజహితం కోసం సమర్థవంతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవడమే చట్టం ఉద్దేశమని తెలిపారు. 

వక్ఫ్ అల్లర్ల వెనక భూకబ్జాదారులు  

వక్ఫ్​ అల్లర్ల వెనుక భూకబ్జాదారులు ఉన్నారని కిరణ్​ రిజిజు ఆరోపించారు. ఈ చట్టంపై ప్రతిపక్ష కాంగ్రెస్​ తప్పుడు సమాచారం ప్రచారంచేస్తూ, ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ బిల్లు ఏ ఒక్క సముదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని, బదులుగా వక్ఫ్ వ్యవస్థను బలోపేతం చేసి, దాని ద్వారా సమాజంలోని అవసరమైన వర్గాలకు మెరుగైన సేవలు అందించడమే దీని లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ చట్టం ముస్లిం సమాజంతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని తెలిపారు.