- నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొత్త పంచాది
- కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి కృష్ణారెడ్డి ఔట్
- ఆయన అనుచరులకూ చెక్
- ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
- లోకల్ వర్సెస్ నాన్ లోకల్ సెంటిమెంట్
కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్ కాంగ్రెస్‌లో లీడర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి మధ్య వార్ నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు గ్రూపులుగా విడిపోయి వేర్వేరుగా ప్రెస్ మీట్స్ పెట్టడం, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల టీపీసీసీ ప్రకటించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుల జాబితా వివాదాస్పదంగా మారింది. ముందు జాబితా ప్రకటించడం, ఆ తర్వాత కొద్ది రోజులకే మార్పులు చేర్పులతో మరో జాబితా ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. హుజూరాబాద్ కాంగ్రెస్‌పై ఆధిపత్యం కోసం తన అనుచరులకే పార్టీ పదవులు ఇవ్వాలంటూ ఇద్దరు నేతలు పోటీపడడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
పత్తి కృష్ణారెడ్డి అనుచరులకు చెక్
హుజూరాబాద్కాంగ్రెస్లో పత్తి కృష్ణారెడ్డి పైచేయి సాధించేందుకు బల్మూరి వెంకట్తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయన అనుచరుల్లో కొందరిని మండల కమిటీలను తొలగించి, తన వర్గం వారిని నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ హుజూరాబాద్ మండల అధ్యక్షుడిగా కె.కిరణ్, టౌన్ అధ్యక్షుడిగా మ్యాకల తిరుపతి, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేశ్‌ను, జమ్మికుంట మండలాధ్యక్షుడిగా పుల్లూరి సదానందం, వీణవంక మండల అధ్యక్షుడిగా మహ్మద్ సాహెబ్ హుస్సేన్, ఇల్లందకుంట మండల అధ్యక్షుడిగా ఈ.రామారావు, కమలాపూర్ మండల అధ్యక్షుడిగా చరణ్ పటేల్ ను, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గూడపు సారంగపాణిని నియమిస్తూ ఇటీవల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే వీరిలో కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి అనుచరులైన సుంకరి రమేశ్, పుల్లూరి సదానందం, మహ్మద్ సాహెబ్ హుస్సేన్, గూడపు సారంగపాణిని మార్చాల్సిందేనని బల్మూరి వెంకట్ పట్టుబట్టినట్లు తెలిసింది. వారిని మార్చకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొద్ది రోజుల్లోనే పేర్లు మార్చి మరో జాబితాను రిలీజ్ చేశారు. ఇందులో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కసుపోసుల వెంకన్న, మండల అధ్యక్షుడిగా ఎర్రబెల్లి రాజేశ్వరరావు, వీణవంక మండల అధ్యక్షుడిగా చింతల రాజారెడ్డి, హుజురాబాద్ టౌన్ అధ్యక్షుడిగా ఎస్.బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ములుగూరి సదయ్యను నియమించారు. మిగతా లీడర్ల పేర్లు మారలేదు.
కృష్ణారెడ్డికి షాక్
హుజూరాబాద్ కాంగ్రెస్‌లో తన అనుచరగణానికి పోటీగా మరో జాబితా ప్రకటించిన షాక్ నుంచి పత్తి కృష్ణారెడ్డి తేరుకోకముందే ఆయన పదవిని కూడా తీసేశారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించి చొప్పదండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పురం రాజేశంను నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
దీంతో పత్తి కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేకుండాపోయింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరుడిగా ఉన్న తనకు త్వరలోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి వస్తుందనే ధీమాతో కృష్ణారెడ్డి ఉన్నప్పటికీ.. హుజూరాబాద్ కాంగ్రెస్ నుంచి ఆయనను పొమ్మనలేక పొగబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
లోకల్ సెంటిమెంట్
2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన బల్మూరి వెంకట్ బరిలోకి దిగాడు. ఆ ఎన్నికల్లో ఆయనకు కేవలం 3,014 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. స్థానికేతరుడు కావడం వల్లే బల్మూరికి నియోజకవర్గంలో ఆదరణ లేదని, స్థానికుడినైన తనకు అవకాశమివ్వాలని పత్తి కృష్ణారెడ్డి లోకల్ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నాడు. టికెట్ అనౌన్స్ కాకముందే ఆధిపత్య పోరు ఇలా ఉంటే.. అభ్యర్థిని ప్రకటించాక ఒకరికొకరు సహకరించుకుంటారా అన్న సందేహాలు కాంగ్రెస్ క్యాడర్‌ను తొలుస్తున్నాయి.