మహిళా లీడర్ భర్త చెప్పిన వార్డులోనే పనులు చేయిస్తున్న ఆఫీసర్లు
మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు: రూలింగ్ పార్టీ లీడర్ల మధ్య అంతర్గత విబేధాలు తరచూ బయట పడుతున్నాయి. అనుకూలంగా ఉన్న వారికే ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్లు పనులు చేస్తున్నారని, మిగతా వారి పనులను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన మున్సిపల్ మీటింగ్‌లో, బుధవారం జరిగిన 'కంటి వెలుగు' సమీక్షలో కౌన్సిలర్ల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు బయట పడ్డాయి.
ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని..
రాజకీయాలకు అతీతంగా మున్సిపాల్టీ అభివృద్ధికి సహకరించాల్సిన కొందరు లీడర్లు, ఆఫీసర్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. చైర్పర్సన్, కమిషనర్ నిర్వహించే కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని రూలింగ్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై ఇటీవల జరిగిన మున్సిపల్ మీటింగ్‌లో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బైకాట్ చేశారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై తమను సంప్రదించకుండా ఎజెండాలో పెట్టడాన్ని తప్పు పట్టారు. రెగ్యులర్‌గా వార్డుల్లో తామే ఉంటామని, ఆఫీసుల్లో కూర్చోని తమ వార్డు సమస్యలపై ఎజెండా రూపొందించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. దీనికితోడు నియోజకవర్గ లీడర్, ఓ మహిళా లీడర్ భర్తకు అనుకూలంగా ఉన్న వారి వార్డుల్లోనే డెవలప్మెంట్ పనులు చేస్తున్నారని.. మిగతా వారి వార్డుల్లో నెలలుగా పనులు పెండింగ్‌లోనే ఉన్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు.
గ్రూపులకు దారి తీసిన 'రియల్' దందా
హైదరాబాద్, శంషాబాద్‌కు జడ్చర్ల దగ్గర్లో ఉంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి కోట్లల్లో పలుకుతోంది. గతంలో ప్లాట్లుగా చేసి విక్రయించిన వాటిని, డబుల్ రిజిస్ర్టేషన్ చేయంచడం.. లిటిగేషన్లో ఉన్న భూములను సెటిల్మెంట్ చేయించడంలో మున్సిపాల్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు కీ రోల్ పోషిస్తున్నారు. ఈ క్రమంలో రూలింగ్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోయారు. ఓ మహిళా లీడర్ భర్త ఈ వ్యవహారంలో ఆరితేరడంతో మెజార్టీ కౌన్సిలర్లు ఆయన పక్షానే ఉన్నారు. ఈయనకు బీఆర్ఎస్ నియోజకవర్గ లీడర్ ఆశీస్సులు కూడా ఫుల్‌గా ఉన్నాయి. జడ్చర్ల చుట్టూ జరిగే ప్లాట్లు, భూ లావాదేవీలన్నీ ఈయన కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇందుకు వచ్చిన దాంట్లో నియోజకవర్గ లీడర్‌కు వాటాలు అందుతున్నట్టు ఆరోపనలుఉన్నాయి. ఈ క్రమంలో వీరు ఇప్పటికే జడ్చర్ల చుట్టూ వందల ఎకరాల్లో సెటిల్మెంట్లు జరిపారు. బినామీ పేర్ల మీద భూములు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ దందాలో కొందరు కౌన్సిలర్లనే కలుపుకుపోయి, మిగతా వారిని మహిళా లీడర్ భర్త పక్కన పెడుతుండటంతో కూడా కౌన్సిలర్ల ఆగ్రహానికి కారమైనట్టు సమాచారం.
నియోజకవర్గ లీడర్ సయోధ్య
గతంలో కూడా కౌన్సిలర్ల మధ్య విబేధాలు బయట పడ్డాయి. ఈ క్రమంలో నియోజకవర్గ లీడర్ కలగజేసుకొని రాజీ కుదిర్చారు. ఇటీవల మున్సిపల్ మీటింగ్‌ను బైకాట్ చేయడంతో కౌన్సిర్లలతో నియోజకవర్గ లీడర్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అలాగే రెండు రోజుల కిందట కంటివెలుగు సమీక్షకు కౌన్సిలర్లను ఆహ్వానించారు. అయితే, కార్యక్రమానికి ఒక రోజు ముందు పిలిచి సమావేశం నిర్వహించడంపై కూడా కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. కౌన్సిలర్ల మధ్య ఉన్న విబేధాలు బయటప పడ్తాయనే మీడియాను కూడా మున్సిపల్ మీటింగ్‌కు రానివ్వలేదనే టాక్ .