
కాగజ్‌నగర్, వెలుగు: కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కేతిని శివారులో ఫారెస్ట్‌కు ఆనుకొని ఉన్న భూమికి సంబంధించి పట్టాదారులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మధ్య వార్ నడుస్తోంది. అది అటవీ భూమి అని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతుండగా.. ఆ భూమికి పట్టాదార్ పాస్‌బుక్ ఉందని, రైతుబంధు కూడా వస్తుందని పట్టాదారులు వాదిస్తున్నారు.
కొన్ని నెలలుగా ఈ వివాదం నడుస్తుండడంతో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు కలిసి జాయింట్ సర్వే చేపట్టారు. కేతిని గ్రామంలోని ఆశ్రమ పాఠశాల వెనుక సర్వే నంబర్ 17, 18, 19లోని 9 ఎకరాల భూమి నల్గొండకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, కాగజ్‌నగర్‌కు చెందిన అంజన్న అనే వ్యక్తుల పేరిట ఉంది. ఆ భూమిలో 70 ఏండ్ల వయస్సు ఉన్న వందలాది టేకు చెట్లు ఉండడంతో వాటిని కొట్టేందుకు పర్మిషన్ ఇవ్వాలని పట్టాదారులు ఆఫీసర్లను కోరారు.
అయితే ఆ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అని, పర్మిషన్ ఇచ్చేది లేదని ఫారెస్ట్ ఆఫీసర్లు స్పష్టంచేశారు. దీంతో భూమికి సంబంధించిన హద్దులు గుర్తించాలని పట్టాదారులు రెవెన్యూ ఆఫీసర్లకు అర్జీ పెట్టారు. ఇప్పటికే పలుమార్లు సర్వే చేసిన ఆఫీసర్లు బుధవారం మరోసారి ఆర్‌ఐ జాఫర్, మండల సర్వేయర్ శ్రీకాంత్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సూర్యనారాయణ, బీట్ ఆఫీసర్ రాజేశ్ పట్టేదార్ తరఫు వ్యక్తితో కలిసి జాయింట్ సర్వే చేపట్టారు. అయినా వివాదం కొలిక్కి రాలేదు.