గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో అధికార పార్టీ లీడర్ల మధ్య వర్గపోరు అధికారులకు తలనొప్పిగా మారుతోంది. చెప్పినట్టు వింటే ఓకే.. లేదంటే ట్రాన్స్‌ఫర్ అన్నట్లు వ్యవహారం సాగుతుండడంతో కొందరు అధికారులకు పోస్టింగ్ ఇచ్చినా చార్జ్ తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వారం కింద హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ ఆర్‌ఎంవో లాలు ప్రసాద్‌ను గద్వాల డీఎంహెచ్‌వోగా నియమించినా నేటికీ చార్జ్ తీసుకోలేదు. ఇక్కడ డ్యూటీ చేయలేనని లాంగ్ లీవ్‌లో వెళ్లిన గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్‌సాగర్ స్థానంలో వచ్చిన నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు నాలుగు రోజులకే సేమ్ ప్లేస్‌కు బదిలీ అయ్యారు. ఆ వెంటనే పాత కమిషనర్‌ను మళ్లీ గద్వాలలో నియమిస్తూ సీడీఎంవో ఆఫీసు నుంచి ఉత్తర్వులు వెలువడ్డా.. ఆయన బాధ్యతలు తీసుకోలేదు. ఇక్కడ పనిచేస్తున్న అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) రఘురామశర్మను ఫిబ్రవరి నెలలోట్రాన్స్‌ఫర్ చేసిన సర్కారు.. పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు గద్వాలలో పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ఇప్పటివరకు జాయిన్ కాలేదు.
ఆఫీసర్లపై ఒత్తిడి చేస్తుండడంతోనే..
గద్వాల జిల్లాలో భూ కబ్జాలు, రేషన్ బియ్యం, ఇసుక, మట్టి, మెడికల్, లిక్కర్.. ఇలా అన్ని దందాలు అధికార పార్టీ కనుసన్నల్లోనే నడుస్తుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో అధికారులు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే మరో వర్గం ఫైఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తోంది. మాట వినకపోతే ట్రాన్స్‌ఫర్లు, సస్పెన్షన్ల వరకు కూడా వెళ్తున్నారు. దీంతో అధికారులు ఇక్కడ డ్యూటీ చేయాలంటే వెనుకంజ వేస్తున్నారు. గతంలో గద్వాల సీఐ ఓ వర్గానికి సపోర్ట్ చేస్తే .. మరో వర్గం ఫిర్యాదుతో సస్పెన్షన్‌కు గురయ్యారని విమర్శలు ఉన్నాయి. తన కూతురుకు మల్దకల్ పీహెచ్‌సీలో ఆయుర్వేద డాక్టర్ పోస్టు కోసం డీఎంహెచ్‌వో చందూనాయక్ రూ.లక్ష తీసుకున్నారని కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప నెల కింద కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఎంక్వైరీకి ఆదేశించారు. కానీ, ఎంక్వైరీ ఆఫీసర్ ముందు ఇదే తిమ్మప్ప తాను డబ్బులు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. ఈ రిపోర్ట్ రాకముందే చందూనాయక్ ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిపోయారు. ఇటీవల గద్వాల కొత్త కమిషనర్ ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే ‘ఎవరిని అడిగి జాయిన్ అయ్యావంటూ’ వెనక్కి పంపించడమే కాదు సాయంత్రలోగా ట్రాన్స్‌ఫర్ చేయించారు.
సమస్యలు ఎవరికి చెప్పుకోవాలె..
ఫిబ్రవరి నుంచి రెవెన్యూ కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉండగా.. ప్రభుత్వం ఇటీవల లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్రీహర్షకు ప్రమోషన్ ఇస్తూ నారాయణపేట కలెక్టర్‌గా బదిలీ చేసింది. కానీ, ఆయన స్థానంలో ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. రెండు అడిషనల్ కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణికి భూసంబంధ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ, పరిష్కారం చూసే కీలక ఆఫీసరే లేకుండా పోయారు.