
- గ్రేటర్ వరంగల్‌లో.. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేలు
- మేయర్ గుండు సుధారాణితో అంటీముట్టనట్లు సిటీ ఎమ్మెల్యేలు
- తూర్పు టికెట్ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్‍తో గ్యాప్
- చల్లా, అరూరితో కాంట్రాక్టుల పర్సంటేజీల పంచాయితీ
- మేయర్ తీరుపై ఎర్రబెల్లి, కేటీఆర్ వద్ద ఎమ్మెల్యేల ఫిర్యాదులు
- తనకు గౌరవం ఇవ్వట్లేదని సుధారాణి రిటర్న్కంప్లైంట్
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. బల్దియా మేయర్ గుండు సుధారాణి తీరుపై సిటీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తన సీటుకు ఎసరు తెస్తున్నారనే సమాచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమెను దూరం పెడ్తుండగా ఎమ్మెల్యే కమ్ కాంట్రాక్టర్లుగా డ్యూయల్ రోల్ పోషించే గులాబీ ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనుల కేటాయింపు, పర్సంటేజీల పంచాయితీ నడుస్తోందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ అంశమై ఎమ్మెల్యేలు మేయర్‍పై.. మేయర్ ఎమ్మెల్యేలపై హైకమాండ్ వద్ద ఫిర్యాదులు చేసుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. కాగా, ప్రజాప్రతినిధులుగా అభివృద్ధిలో తమ మార్క్ చూపాల్సిన లీడర్లు.. టికెట్లు, పర్సంటేజీల విషయంలో గ్రూపు రాజకీయాలు, కోల్డ్ వార్‍కు దిగడంపై జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నరేందర్‍తో.. ‘తూర్పు’ సీటు ఫైట్
గ్రేటర్ వరంగల్ మేయర్‍గా వ్యవహరిస్తున్న గుండు సుధారాణి ఈసారి వరంగల్ తూర్పు నియోజకవర్గ సీటుపై ఆశలు పెంచుకున్నారు. గాడ్‍ఫాదర్ల సాయంతో తెరవెనుక హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఎప్పటినుంచో సుధారాణిని దూరం పెట్టారు. ప్రొటోకాల్ ప్రకారం కనీసం పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇన్విటేషన్ కూడా ఇవ్వట్లేదు. కార్పొరేటర్లను కూడా ఆమెతో కలవకుండా కట్టడి చేశారు. కాగా, మున్సిపల్ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ పర్యటనల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేస్తూ వస్తుండగా.. వరంగల్ తూర్పులో మాత్రం నరేందర్ సీటు కన్ఫర్మ్ చేయలేదు. దీంతో అధికార బీఆర్‍ఎస్ పార్టీ అభ్యర్థిగా తాను, లేదంటే తన కుటుంబంలోని ఒకరికి తూర్పు టికెట్ దక్కించుకునేలా సుధారాణి అడుగులు వేస్తున్నారు. మిగతా సిట్టింగుల మాదిరి తనకు ముందస్తుగా సీటు ఓకే చేయలేదనే బాధలో నరేందర్ ఉన్న టైంలో ఆమె స్పీడ్ పెంచారు. ఈ నెల 13 కోరుట్లలో నిర్వహించిన పద్మశాలీ యుద్ధబేరి సభకు సుధారాణి హాజరై మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి అధికార బీఆర్‍ఎస్ పార్టీ అభ్యర్థిగా తాను సైతం బరిలో ఉండేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. నరేందర్‍పై గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన మేయర్ ఇప్పుడు ఆయనతో ఢీ అంటే ఢీ అనేలా అడుగులు వేస్తుండడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
చల్లా, అరూరితో.. పర్సంటేజీల పంచాయితీ
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నారు. కాగా, వీరిద్దరు కూడా ఎమ్మెల్యే అవడానికి ముందు నుంచే కాంట్రాక్టర్లు. కాగా, వరంగల్ సిటీలో స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ వంటి సెంట్రల్ గవర్నమెంట్ పనులతో పాటు బల్దియా ఆధ్వర్యంలో చేపడ్తున్న వందల కోట్ల పనులను ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యుల పేరుతో చేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. సుధారాణి కంటే ముందు మేయర్‍గా వ్యవహరించిన నరేందర్ అప్పటి మేజర్ వర్క్స్ అన్నీ తమ వర్గానికి ఇప్పించుకోవడం తనకు రావాల్సిందేదో సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాత మేయర్‍కు గుండు సుధారాణి వచ్చినా.. ఫైల్స్ మీద సంతకాలు చేయడం తప్పించి అసలు బెనిఫిట్స్ దక్కడంలేదనే భావనలో ఆమె ఉన్నారు.
కొత్త పనులు శాంక్షన్ చేసే క్రమంలో వాటిని చల్లా, అరూరి అనుచరులు దక్కించుకుంటున్నారు. ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్లు కావడంతో మేయర్‍కు దక్కాల్సింది పర్సంటేజీ అందడంలేదని భావిస్తున్నారు. దీంతో పనులకు సంబంధించి బిల్లులు పెట్టే టైంలో రూల్స్ ఫాలో అవడం ద్వారా సహాయ నిరాకరణ చేశారు. సుధారాణి కొడుకు చల్లా నియోజకవర్గ పరిధిలో ఓ వెంచర్ చేసే క్రమంలో ఎమ్మెల్యేగా ఆయన సైతం సహకరించలేదనే ప్రచారం ఉంది. కాగా, సుధారాణి మేయర్‍గా కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడ్తున్నారని జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లికి ఫిర్యాదులు వెళ్లాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్ డైరెక్ట్‌గా ఆమెతో విభేదాలు లేకున్నా.. తన సోదరుడు దాస్యం విజయ్ భాస్కర్‍కు మేయర్ పీఠం దక్కకపోవడానికి సుధారాణే కారణమనే ఫీల్‍లో ఉన్నారు. ఎవరూ ఊహించని రీతిలో తనకున్న పరిచయాల ద్వారా హైకమాండ్ నుంచి మేయర్ పోస్ట్ తెచ్చుకున్నారని ఆయన వర్గం భావిస్తోంది.
మేయర్.. రిటర్న్ కంప్లైంట్
మేయర్ సుధారాణి తీరుతో తాము పనులు చేయలేక పోతున్నామని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. సుధారాణి సైతం వారిపై రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరానికి మేయర్‍గా ఉన్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారని ప్రతీసారి సుధారాణి పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఒక సీనియర్ మహిళా ప్రజాప్రతినిధి అనే మర్యాద లేకుండా అవమానపరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ప్రోటోకాల్ ప్రకారం రెస్పెక్ట్ ఇవ్వడంలేదని తన బాధ పలుమార్లు చెప్పుకున్నారు. మేయర్, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇష్యూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు చేరినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండగా.. గ్రేటర్ లీడర్ల మధ్య పంచాయితీ తన వద్దకు రావడంతో కేటీఆర్ ఇరువురిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.